భారతీయ సినిమాలో స్టంట్ మాస్టర్‌గా అనల్ అరసుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తమిళనాడుకు చెందిన ఈయన తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో స్టార్ హీరో చిత్రాలకు పని చేస్తూ ప్రముఖ స్టంట్ మాస్టర్‌గా రాణిస్తున్నారు. ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ మూవీ జవాన్‌కు అనల్ అరసు స్టంట్ కొరియోగ్రఫీ చేశారు. త్వరలో తెరపైకి రానున్న ఇండియన్–2 చిత్రానికీ ఈయన ఫైట్స్ కంపోజ్ చేశారు.
'టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు'
ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న వా వాద్ధియారే, హిందీలో బేబీజాన్, వార్ 2 తదితర చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు దర్శకుడిగానూ అవతారమెత్తారు. ఈయన స్వీయ దర్శకత్వంలో హీరో విజయ్‌సేతుపతి వారసుడు సూర్యను హీరోగా పరిచయం చేస్తూ ఫీనిక్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇకపోతే అనల్ అరసు 'టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు' పోటీల్లో నామినేట్ అయ్యారు.
జవాన్ చిత్రానికి గానూ నామినేట్
దీని గురించి ఆయన సోమవారం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుపుతూ టారస్ వరల్డ్ స్టంట్ అవార్డుల్లో.. జవాన్ చిత్రానికి గానూ తన పేరు నామినేట్ అయ్యిందని చెప్పారు. ఇది ఆస్కార్ అవార్డుకు సమానమైనదిగా పేర్కొన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా స్టంట్ కొరియోగ్రఫీ కేటగిరికి సంబంధించిన పురస్కారం అని చెప్పారు. ప్రపంచ స్థాయి చిత్రాలలో జవాన్ మూవీతో పాటు హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజబుల్, జాన్ విక్స్ 4 మొదలగు ఐదు చిత్రాలు నామినేట్ అయ్యినట్లు చెప్పారు.
అవార్డు వస్తే సంతోషం
ఈ నెల 11న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఈ అవార్డు వేడుక కోసం అమెరికాకు పయనమవుతున్నట్లు తెలిపారు. తాను ఇంతకు ముందు 2017లో కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యానని, అయితే అది ప్రాంతీయ చిత్రాల కేటగిరి కావడంతో పెద్దగా ప్రచారం జరగలేదన్నారు. ఇప్పుడు వరల్డ్ స్థాయి చిత్రాల కేటగిరీలో జరుగుతున్న పోటీలో ఇంత వరకూ భారతీయ సినిమాకు చెందిన ఏ స్టంట్ మాస్టర్ ఈ అవార్డును గెలుచుకోలేదన్నారు. అలాంటి తనకు అవార్డు వస్తే సంతోషం అని అనల్ అరసు పేర్కొన్నారు. ఈ అవార్డుకు నామినేట్ అవడంతో షారుక్ ఖాన్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, దర్శకుడు అట్లీ వంటి పలువురు అభినందించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment