మోదీ దేశ సంపదను వారికే ఇస్తున్నారు.. మండిపడ్డ రాహుల్ గాంధీ | Sakshi
Sakshi News home page

మోదీ దేశ సంపదను వారికే ఇస్తున్నారు.. మండిపడ్డ రాహుల్ గాంధీ

Published Thu, Apr 18 2024 6:57 PM

There Are Two Indias Says Rahul Gandhi - Sakshi

తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ దిగ్గజ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీ కేరళలోని పాలక్కాడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాహుల్‌ గాంధీ గురువారం కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. 'రెండు భారతదేశాలు' ఉన్నాయన్నారు. ఒకటి బిలియనీర్లకు మాత్రమే సంబంధించింది. ఇక్కడ వారు కలలను నెరవేర్చుకోగలరు. మరొకదానిలో పెద్ద సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు అని అన్నారు.

మన దేశంలో 70 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారు 22 మంది మాత్రమే ఉన్నారు. అలాగే రోజుకు రూ.100 కంటే తక్కువ సంపాదించే వారు 70 కోట్ల మంది ఉన్నట్లు రాహుల్‌ గాంధీ చెప్పారు. తన ప్రసంగంలో పేద, మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్నులను గురించి వ్యాఖ్యానించారు. భారతదేశంలో అత్యంత పేద వ్యక్తి గౌతమ్ అదానీ అని ఎద్దేవా చేశారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 మంది భారతీయుల 16 లక్షల కోట్ల విలువైన బ్యాంకు రుణాలను మాఫీ చేశారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భారతదేశంలో అస్థిరతను సృష్టించడం, ఒక భారతీయుడు మరొక భారతీయుడితో పోరాడేలా చేయడమే బీజేపీ ఆలోచన అని అన్నారు. చివరికి, వారు చేసేదల్లా ప్రధానమంత్రికి సన్నిహితంగా ఉన్న కొంతమందికి భారతదేశ సంపదను ఇవ్వడమే అని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ తన కంచుకోట అయిన కేరళలోని వయనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, వయనాడ్ సమస్యలను దేశం, ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. ఇక్కడి సమస్యలపై పోరాడతానని.. ప్రజలకు అండగా ఉంటానని ఆయన అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement