400 సీట్లలో బీజేపీ గెలవాలి.. అందులో హైదరాబాద్‌ ఉండాలి | Home Minister Amit Shah at Patabasti Road Show | Sakshi
Sakshi News home page

400 సీట్లలో బీజేపీ గెలవాలి.. అందులో హైదరాబాద్‌ ఉండాలి

Published Thu, May 2 2024 4:23 AM | Last Updated on Thu, May 2 2024 4:23 AM

Home Minister Amit Shah at Patabasti Road Show

40 ఏళ్లుగా రజాకార్లు ఏలుతున్నారు 

ఈ సారి బీజేపీకి మంచి అవకాశం 

మేం ఏ వర్గానికీ వ్యతిరేకం కాదు.. అందరికీ అండగా ఉంటాం 

హిందూ ముస్లింలు కలిసి బీజేపీకి ఓటు వేయాలి 

పాతబస్తీ రోడ్‌ షోలో హోం మంత్రి అమిత్‌ షా 

చేతిలో కమలం పువ్వు..విజయ సంకేతం చూపుతూ ర్యాలీ 

మర్ఫా వాయిద్యాలతో ముస్లింల ఘన స్వాగతం 

కదం తొక్కిన కమల దళం 

హోరెత్తిన ‘జై శ్రీరామ్, వందేమాతరం, భారత్‌మాతాకీ జై’నినాదాలు.. 

దారి పొడవునా భోనాలు..డప్పు దరువులు, పూల వర్షం 

లాల్‌ దర్వాజా మహంకాళీ అమ్మవారికి పూజలు

సాక్షి, హైదరాబాద్‌: దేశాన్ని అన్ని రంగాల్లోనూ విజయపథంలో తీసుకువెళ్తున్న నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానిని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత గెలుపు కోసం బుధవారం రాత్రి పాతబస్తీలో రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షోలో అమిత్‌ షా మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా 400 సీట్లలో గెలవాలని, అందులో హైదరాబాద్‌ సీటు తప్పనిసరిగా ఉండాలని ఆకాంక్షించారు. 

40 ఏళ్లుగా రజా కార్లు హైదరాబాద్‌ను ఏలుతున్నారనీ, ఈ సారి బీజేపీకి మంచి అవకాశం ఉందని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత గెలుపుతో ఈ రజాకార్ల పాలన నుంచి విముక్తి లభిస్తుందన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్న అమిత్‌షా తాము అందరికీ అండగా ఉంటామని భరోసానిచ్చారు. హిందువులతో పాటు ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేయా లని పిలుపునిచ్చారు. అప్పుడే హైదరాబాద్‌ ప్రజలను ఎవ్వరూ టచ్‌ చేయలేరని వ్యాఖ్యానించారు. 

అప్పటికే సమయం రాత్రి పదిగంటలవడంతో అమిత్‌షా ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. ముందుగా మాధవీలత మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయ, ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆశీస్సులతో ఈసారి తప్పకుండా పాతబస్తీలో బీజేపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఇక్కడ అణిచివేతకు గురవుతున్న ప్రజలందరిలోని ఆవేశం ఓటు కింద మారాలని పిలుపునిచ్చారు. 

మహంకాళీ అమ్మవారికి అమిత్‌ షా పూజలు 
బుధవారం రాత్రి 9.24 గంటలకు అమిత్‌షా లాల్‌దర్వాజా మహంకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతతో కలిసి ఐదు నిమిషాల పాటు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అభివాదం చేస్తూ..విజయ సంకేతం చూపుతూ.. 
పూజల అనంతరం అమిత్‌ షా 9.31 గంటలకు ప్రచార ర థం ఎక్కి.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ..లాల్‌ దర్వాజా నుంచి వెంకట్రావ్‌ స్కూల్, లాల్‌ దర్వాజ్‌ మోడ్, సుధా టాకీస్‌ చౌరస్తా వరకు రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో కమలనాధులు కదం తొక్కారు. వందేమాతరం...భారత్‌ మాతాకీ జై..జై శ్రీరామ్‌ నినాదాలతో హోరెత్తించారు. దారి పొడవునా పార్టీ శ్రేణులు అమిత్‌షాపై పూల వర్షం కురిపించారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు.

 ఆయన ఒక చేత్తో విజయ సంకేతం, మరో చేత్తో కమలం పువ్వును చూపిస్తూ ముందుకు సాగారు. సుమారు 25 నిమిషాల పాటు ఓపెన్‌టాప్‌ జీప్‌పై నిలబడి రోడ్‌ షో నిర్వహించారు. యాకుత్‌పుర, చాంద్రా యణగుట్ట, చార్మినార్, బహదుర్‌పుర, మలక్‌పేట్, ఘోషామహల్, కార్వాన్‌ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు ఈ రోడ్‌ షోకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. 

వాజ్‌పేయి తర్వాత.. షానే
పాతబస్తీలో బీజేపీ అభ్యర్థుల తరపున గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రచారం చేయగా, ఆ తర్వాత దేశ హోంశాఖామంత్రి హోదాలో అమిత్‌షా ఇక్కడికి రావడం విశేషం. ఎంఐఎంకు కంచుకోటలా ఉన్న పాతబస్తీలో అమిత్‌షా రోడ్‌ షో నిర్వహించడం ఆ పార్టీ శ్రేణులోŠల్‌ జోష్‌ నింపింది. 

కాగా, అమిత్‌షాకు పలువురు ముస్లింలు మర్ఫా వాయిద్యాలతో ఘన స్వాగతం పలకడం విశేషం. ఇక నిన్న మొన్నటి వరకు ఎడమొఖం.. పెడముఖంగా ఉన్న గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎంపీ అభ్యర్థి మాధవిలతతో కలిసి ప్రచారం నిర్వహించడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement