Asia Cup 2023: పాకిస్తాన్‌కు బ్యాడ్‌ న్యూస్‌ | Asia Cup 2023:Naseem Shah Ruled Out Of Asia Cup With Shoulder Injury, PCB Names Replacement - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: పాకిస్తాన్‌కు బ్యాడ్‌ న్యూస్‌

Published Wed, Sep 13 2023 8:01 PM

Asia Cup 2023: Naseem Shah Out Of Asia Cup With Shoulder Injury, Zaman Khan Drafted In - Sakshi

ఆసియా కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో రేపు (సెప్టెంబర్‌ 14) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలింది. టీమిండియాతో సూపర్‌-4 మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన ఆ దేశ స్టార్‌ పేసర్‌ నసీం​ షా ఆసియా కప్‌ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఇవాళ (సెప్టెంబర్‌ 13) అధికారికంగా ప్రకటించింది. నసీం షా గాయం (భుజం) తీవ్రత అధికంగా ఉండటంతో, త్వరలో జరుగనున్న వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని అతనికి పూర్తి విశ్రాంతినిచ్చినట్లు పీసీబీ పేర్కొంది. నసీం​ షా స్థానాన్ని జమాన్‌ ఖాన్‌తో రీప్లేస్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.

జమాన్‌ ఇప్పటికే జట్టులో చేరిపోయాడని, ట్రైనింగ్‌లో కూడా పాల్గొంటున్నాడని తెలిపింది. నసీం షా జట్టును వీడినప్పటికీ, అతను నిరంతరం పీసీబీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని, ప్రపంచకప్‌ సమయానికంతా అతను పూర్తి ఫిట్‌నెస్ట్‌ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు భారత్‌తో సూపర్‌-4 మ్యాచ్‌ సందర్భంగానే గాయపడిన మరో పేసర్‌ హరీస్‌ రౌఫ్‌పై పీసీబీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

పీసీబీ డాక్టర్లు నసీం, రౌఫ్‌లు ఇద్దరు తమ పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు కాని, రౌఫ్‌ గురించి ప్రత్యేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో రౌఫ్‌ గాయం నుంచి కోలుకున్నాడని తెలుస్తుంది. నసీంతో పోలిస్తే రౌఫ్‌ గాయం తేలికపాటిదని, అతను పూర్తిగా రికవర్‌ అయ్యాడని సమాచారం. తొలుత పీసీబీ రౌఫ్‌కు కూడా రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించాలని భావించినప్పటికీ, అతను వేగంగా కోలుకోవడంతో ఆ అవసరం లేదని భావించినట్లు తెలుస్తుంది.

రౌఫ్‌ రేపు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి నసీం షా ఒక్కడే గాయం కారణంగా పాక్‌ జట్టును వీడాడు. కాగా, భారత్‌తో మ్యాచ్‌ తర్వాత గాయపడిన రౌఫ్‌కు రీప్లేస్‌మెంట్‌గా షానవాజ్‌ దహానిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే, ఆసియా కప్‌-2023లో పాక్‌ భవితవ్యం రేపు (సెప్టెంబర్‌ 14) శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో తేలిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాక్‌ ఓడినా లేక ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైనా ఆ జట్టు ఫైనల్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలిస్తే మాత్రం సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement