
ఏపీలో జరుగుతున్న టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది.
ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి, జాతీయ మానవహక్కుల కమిషన్లకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ పార్టీ ఎంపీలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకే ఉంది’’
బాధితుల ఆక్రందనలు చంద్రబాబుకు కనిపించడం లేదా?
‘‘చట్టం లేదు, సేచ్ఛ లేదు, న్యాయం లేదు. అన్యాయమే రాజ్యమేలుతోంది. బాధితులు ఫిర్యాదు చేస్తామన్నా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. వెళ్లాయి.. కానీ ఎలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, వాళ్ల ఆస్తులే లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తున్నాయి. మీరు టీడీపీ కార్యకర్తలా.. గూండాలా?. ప్రమాణస్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారు. హింసకు గురైన బాధితులు ఆక్రందనలు చంద్రబాబుకు కనిపించడం లేదా?’’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది..
‘‘ఇది చీకటి అధ్యాయంగా చర్రితలో మిగిలిపోతుంది. టీడీపీ దాడులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్లపై దాడి చేసి, సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. మంగళగిరిలో లోకేష్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్తల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ తగలబెడుతోంది. ఈ హింస ఇలాగే కొనసాగితే బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా దాడులు చేయడం మంచి సంప్రదాయం కాదు. చివరకు మీడియా స్వేచ్ఛను కూడా అణచివేస్తున్నారు. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది.’’అని విజయసాయి ధ్వజమెత్తారు.
చంద్రబాబు రాక్షస పాలన చేస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి
కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని హింసను అరికట్టాలి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న బిజెపి వెంటనే స్పందించాలి. ప్లాన్ ప్రకారమే ప్రమాణ స్వీకారానికి ముందే నాయకులు, ఆస్తుల పై దాడులు చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. దాడుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పీఎం, హోం మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఈ దాడులకు బీజేపీ కూడా బాధ్యత వహించాలి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకో: మిధున్ రెడ్డి
రాజకీయాల్లో గెలుపోటమలు సహజమని... కానీ గత కొన్ని రోజులగా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా దారుణమని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్షనేత పి.మిధున్ రెడ్డి అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని… కానీ ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, గాయపర్చడం, ఇళ్లు కూల్చవేయడంతో పాటు వ్యాపారాలు కూడా దెబ్బతీయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
రాజకీయాల్లో ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదని.. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా… ఈ విధంగా కార్యకర్తలపై దాడులు చేయడం, ఆస్తుల ధ్వంసం చేయడం వంటివి గతంలో లేవని.. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు గతంలో జరగలేదన్నారు. ఆ తరహా దాడులకు పాల్పడ్డం సరికాదన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి మేండేట్ ఇచ్చారని.. ఈ నేపధ్యంలో టీడీపీ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో… అవన్నీ పూర్తి చేయాలని సూచించారు.
40 శాతం ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటే వేశారన్న విషయం టీడీపీ గుర్తుపెట్టుకోవాలని.. కేవలం మీకు వచ్చిన 50 శాతం పైచిలుకు ప్రజలకే కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. దాడులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర పతి, మానవహక్కుల కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లామన్నారు.
