విధ్వంసం సృష్టించిన కేకేఆర్‌ యువ బ్యాటర్‌.. శుభ్‌మన్‌ గిల్‌ తర్వాత..! | Sakshi
Sakshi News home page

IPL 2024 DC VS KKR: విధ్వంసం సృష్టించిన కేకేఆర్‌ యువ బ్యాటర్‌.. శుభ్‌మన్‌ గిల్‌ తర్వాత..!

Published Wed, Apr 3 2024 9:09 PM

IPL 2024: KKR Batter Angkrish Raghuvanshi Smashed 25 Ball Fifty, Second Youngest To Score Fifty For KKR - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ యువ బ్యాటర్‌ అంగ్క్రిష్ రఘువంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా కేకేఆర్‌ తరఫున శుభ్‌మన్‌ గిల్‌ తర్వాత అత్యంత పిన్న వయసులో హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శుభ్‌మన్‌ 18 ఏళ్ల 237 రోజుల వయసులో (2018 సీజన్‌) సీఎస్‌కేపై హాఫ్‌ సెంచరీ చేయగా.. రఘువంశీ 18 ఏళ్ల 303 రోజుల వయసులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అర్దసెంచరీ సాధించాడు. రఘువంశీకి ఐపీఎల్‌లో ఇది తొలి ఇన్నింగ్స్‌ కావడం విశేషం. 

ఈ ఇన్నింగ్స్‌కు ముందు అతను ఓ మ్యాచ్‌ ఆడినా అందులో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. కేకేఆర్‌ తరఫున అరంగేట్రం ఇన్నింగ్స్‌లో ఆరో అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగానూ రఘువంశీ రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 27 బంతులు ఎదుర్కొన్న రఘువంశీ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో రఘువంశీతో పాటు సునీల్‌ నరైన్‌ సైతం విధ్వంసం సృష్టించాడు.

నరైన్‌ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. వీరిద్దరి ఊచకోత ధాటికి ఢిల్లీ బౌలర్లు వణికిపోయారు. వీరిద్దరు ఔటయ్యాక రసెల్‌ భారీ షాట్లు ఆడటం మొదలుపెట్టాడు. రసెల్‌ 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేసి క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. అతనికి జతగా శ్రేయస్‌ అయ్యర్‌ (12) ఉన్నాడు. నరైన్‌, రఘువంశీ, రసెల్‌ ధాటికి కేకేఆర్‌ 16వ ఓవర్‌లోనే 200 పరుగుల మార్కును దాటింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇది మూడో వేగవంతమై 200. 17 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 224/3గా ఉంది.  

ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐదో ఓవర్‌లో ఫిలిప్‌ సాల్ట్‌ (18) ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్‌ స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి సాల్ట్‌ పెవిలియన్‌కు చేరాడు. కాగా, ప్రస్తుత సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కేకేఆర్‌ మరో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది.

అండర్‌-19 వరల్డ్‌కప్‌ హీరో.. 18 ఏళ్ల రఘువంశీ భారత అండర్‌-19 జట్టు వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు. 2022 వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో రఘువంశీ భారత్‌ తరఫున లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. 

Advertisement
Advertisement