Sakshi News home page

IPL 2024 KKR VS SRH: శభాష్‌ సుయాష్‌.. సన్‌రైజర్స్‌ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు..!

Published Sun, Mar 24 2024 12:07 PM

IPL 2024 KKR VS SRH: Suyash Sharma Taken The Match Changing Catch Of Klaasen In Last Over - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ప్రారంభమైన రెండో రోజు అదిరిపోయే మ్యాచ్‌ను అందించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య నిన్న (రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. 

భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ తొలి బంతికే సిక్సర్‌ బాది సన్‌రైజర్స్‌ శిబిరంలో గెలుపుపై ధీమా పెంచగా.. కేకేఆర్‌ ఆటగాళ్లు హర్షిత్‌ రాణా, సుయాష్‌ శర్మ ఆ ఆనందాన్ని వారికి ఎంతో సేపు నిలబడనీయలేదు.

చివరి ఓవర్‌ బౌలింగ్‌ చేసిన రాణా వైవిధ్యమైన బంతులు సంధించి సన్‌రైజర్స్‌ గెలుపుకు అడ్డుకోగా.. సుయాష్‌ శర్మ కీలక దశలో (2 బంతుల్లో 5 పరుగులు) మెరుపు క్యాచ్‌ (క్లాసెన్‌) పట్టి ఆరెంజ్‌ ఆర్మీ చేతుల్లో నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నాడు.

సుయాష్‌ ఆ క్యాచ్‌ మిస్‌ చేసి ఉంటే బౌండరీ లభించి సన్‌రైజర్స్‌ సునాయాసంగా మ్యాచ్‌ గెలిచేది. ఒకవేళ ఆ క్యాచ్‌ డ్రాప్‌ అయ్యి, పరుగు రాకపోయినా అప్పటికే శివాలెత్తి ఉన్న క్లాసెన్‌ ఆఖరి బంతికి సిక్సర్‌ బాది సన్‌రైజర్స్‌ను గెలిపించేవాడు. సుయాష్‌ అందుకున్న ఈ అద్భుతమైన రన్నింగ్‌ ‍క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌ అని ఇందుకే అంటారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. సాల్ట్‌ (54), రసెల్‌ (64) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆఖర్లో రసెల్‌ 7 సిక్సర్లు, 3 బౌండరీలతో విరుచుకుపడి కేకేఆర్‌ 200 పరుగుల మార్కును దాటేందుకు దోహదపడ్డాడు. చివర్లో రమన్‌దీప్‌ సింగ్‌ (35; ఫోర్‌, 4 సిక్సర్లు), రింకూ సింగ్‌ (23; 3 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో నటరాజన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. మయాంక్‌ మార్కండే 2, కమిన్స్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌.. ఆదిలో తడబడినప్పటికీ గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమిపాలైంది. క్లాసెన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో (29 బంతుల్లో 63; 8 సిక్సర్లు) మ్యాచ్‌ రూపురేఖల్నే మార్చేశాడు. అయితే గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో అతడు ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ఒక్కసారిగా కేకేఆర్‌పైపు మలుపు తిరిగింది.

ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సన్‌రైజర్స్‌ ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (32), అభిషేక్‌ శర్మ (32) ఓ మోస్తరు స్కోర్లతో శుభారంభాన్ని అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి జిడ్డు బ్యాటింగ్‌తో (20 బంతుల్లో 20) సన్‌రైజర్స్‌ ఓటమి​కి పరోక్ష కారకుడయ్యాడు. సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్‌ తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. 

Advertisement

What’s your opinion

Advertisement