SRH: ధోని రావొద్దనే కమిన్స్‌ ‘కన్నింగ్‌’ ప్లాన్‌?! | Sakshi
Sakshi News home page

ధోని రావొద్దనే ఇలా చేశావా?.. జడ్డూ విషయంలో కమిన్స్‌ ‘కన్నింగ్‌’ ప్లాన్‌?!

Published Sat, Apr 6 2024 1:08 PM

Kaif Intriguing Keep Dhoni Indoors Theory On Cummins On Field Act Fans Fire - Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌, ఆస్ట్రేలియా సారథి ప్యాట్‌ కమిన్స్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కమిన్స్‌ కెప్టెన్సీని ప్రస్తావిస్తూ.. టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తావా అంటూ ప్రశ్నలు సంధించాడు. ఫలితంగా నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే?!... ఐపీఎల్‌-2024లో భాగంగా సన్‌రైజర్స్‌ శుక్రవారం ఉప్పల్‌ వేదికగా సీఎస్‌కేతో తలపడింది. సొంతమైదానంలో టాస్‌ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

స్లో వికెట్‌ మీద రన్స్‌ రాబట్టేందుకు సీఎస్‌కే బ్యాటర్లు ఇబ్బంది పడగా.. పిచ్‌ పరిస్థితులను రైజర్స్‌ బౌలర్లు చక్కగా వినియోగించుకున్నారు. సీఎస్‌కేను 165 పరుగులకే కట్టడి చేయగలిగారు.

శివం దూబే ఒక్కడు ధనాధన్‌ ఇన్నింగ్స్‌(24 బంతుల్లో 45) ఆడగా.. అతడిని కమిన్స్‌ తన బౌలింగ్‌లోనే అవుట్‌ చేశాడు. ఇదిలా ఉంటే.. దూబే స్థానంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు.

ఇక పందొమ్మిదో ఓవర్‌ నాలుగో బంతికి భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో జడ్డూ రనౌట్‌ కావాల్సింది. అయితే, ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు యత్నించిన జడ్డూ.. ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డు తగిలినట్లుగా కనిపించింది. 

దీంతో రైజర్స్‌ వికెట్‌ కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ అబ్‌స్ట్రకింగ్‌ ది ఫీల్డ్‌కు సిగ్నల్‌ ఇచ్చాడు. అయితే, కెప్టెన్‌ కమిన్స్‌ మాత్రం జడ్డూ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్నాడు. ఫలితంగా జడ్డూకు లైఫ్‌ వచ్చింది. ఇక డారిల్‌ మిచెల్‌ స్థానంలో మైదానంలోకి వచ్చిన ధోని ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.

ఇదిలా ఉంటే.. జడ్డూ విషయంలో కమిన్స్‌ వ్యవహారశైలిపై నెట్టింట పెద్ద ఎత్తు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహ్మద్‌ కైఫ్‌ స్పందిస్తూ.. ‘‘జడేజా అబ్‌స్ట్రకింగ్‌ ది ఫీల్డ్‌ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్న ప్యాట్‌ కమిన్స్‌కు రెండు ప్రశ్నలు..

పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్న జడేజాను క్రీజులోనే ఉండనిచ్చి ధోనిని డ్రెసింగ్‌రూంకే పరిమితం చేసేందుకు పన్నిన వ్యూహమా? 

ఒకవేళ టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లి క్రీజులో ఉన్న సమయంలో కూడా ఇలాగే చేస్తాడా?’’ అని కమిన్స్‌ను ఉద్దేశించి ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టాడు. ధోనిని మైదానంలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు.. అతడు బ్యాట్‌ ఝులిపించకుండా ఉండేందుకు ఇలా చేశాడని కైఫ్‌ పరోక్షంగా కమిన్స్‌ను తప్పుబట్టాడు.

అదే సమయంలో.. వరల్డ్‌కప్‌ లాంటి ఈవెంట్లలో కూడా ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తావా అని ప్రశ్నించాడు. అయితే, కైఫ్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గెలుపు కోసం కెప్టెన్లు తమదైన వ్యూహాలు అమలు చేయడంలో తప్పు లేదు అని కొంతమంది అంటుండగా.. అసలు వరల్డ్‌కప్‌నకు దీనికి సంబంధం ఏమిటని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. 

మరికొందరేమో.. ‘‘ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కెప్టెన్‌ మార్ష్‌. కమిన్స్‌ కాదు. మీరు కావాలనే విరాట్‌ కోహ్లి పేరును ప్రస్తావించి హైలైట్‌ అవ్వాలని చూస్తున్నారు కదా’’అని సెటైర్లు వేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నైపై సన్‌రైజర్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్‌ పక్కన ఎవరీ అమ్మాయి?

Advertisement

తప్పక చదవండి

Advertisement