కోహ్లి అలా చేయడు.. కానీ ఈసారి!.. సంజూ కూడా అంతే: రోహిత్‌ శర్మ | Kohli Normally Does Not: Skipper Rohit Sharma Massive Intent Remark In 3rd T20I Against Afghanistan - Sakshi
Sakshi News home page

#RoKo: కోహ్లి అలా చేయడు.. కానీ ఈసారి!.. సంజూ కూడా అంతే: రోహిత్‌ శర్మ

Published Fri, Jan 19 2024 2:48 PM

Kohli Normally Does Not: Skipper Rohit Sharma Massive Intent Remark - Sakshi

India vs Afghanistan, 3rd T20I- Rohit Comments On Kohli: అంతర్జాతీయ టీ20 పునరాగమనంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తమదైన ముద్ర వేయగలిగారు. అఫ్గనిస్తాన్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్‌గా వెనుదిరిగిన రోహిత్‌.. ఆఖరి టీ20లో మాత్రం సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

సహచర ఆటగాళ్లంతా పెవిలియన్‌కు వరుస కట్టిన వేళ అజేయ శతకంతో రాణించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో అత్యధిక సెంచరీలు(5) బాదిన క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ చరిత్రకెక్కాడు. మరోవైపు.. తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న కోహ్లి.. రెండో మ్యాచ్‌ ద్వారా రీఎంట్రీ ఇచ్చి విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

విలువైన ఇన్నింగ్స్‌తో
పదహారు బంతుల్లో 29 పరుగులు రాబట్టి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, బుధవారం నాటి మూడో టీ20లో మాత్రం తన శైలికి భిన్నంగా ఆది నుంచే దూకుడు ప్రదర్శించాలని యత్నించి విఫలమయ్యాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటైన కోహ్లి.. తద్వారా తన ఇంటర్నేషనల్‌ టీ20 కెరీర్‌లో తొలిసారి గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

సంజూ కూడా డకౌట్‌
మరోవైపు.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ కూడా రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక కోహ్లి మాదిరే వచ్చీ రాగానే పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వీరిద్దరి ప్రదర్శన గురించి చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.

టీమిండియా- అఫ్గనిస్తాన్‌ టీ20 సిరీస్‌ బ్రాడ్‌కాస్టర్‌ జియో సినిమాతో మాట్లాడుతూ.. ‘‘ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలి.. వాళ్ల నుంచి మేము ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామన్న అంశాల గురించే జట్టులోని ఆటగాళ్లకు చెప్తాము. 

మైదానంలో దిగిన తర్వాత ఏం చేయాలో, ఎలా ఆడాలో వాళ్లకంటూ ఓ వ్యూహం ఉంటుంది. అలాగే వాళ్లు ఎలా ఆడాలని మేము కోరుకుంటున్నామో కూడా పూర్తి అవగాహనతో ఉంటారు.

కోహ్లి అలా చేయడు.. కానీ ఈసారి మాత్రం
ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని ప్రయత్నించాడు. సాధారణంగా అతడు ఇలా చేయడు. అయితే, జట్టు కోసం ఏదైనా భిన్నంగా చేయాలనే తాపత్రయంతోనే కోహ్లి అలా ఆడాడు. శాంసన్‌ కూడా అంతే.. ఎదుర్కొన్న తొలి బంతికే షాట్‌కు యత్నించాడు. ఏదేమైనా వాళ్ల ఉద్దేశం మాత్రం సరైందే’’ అని రోహిత్‌ శర్మ.. విరాట్‌ కోహ్లి, సంజూ శాంసన్‌లను సమర్థించాడు.

కాగా అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20లో ఫరీద్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి, సంజూ శాంసన్‌ సున్నా పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించారు. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గన్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే.

చదవండి: IND vs AFG 3rd T20I Highlights: రోహిత్‌ సూపర్‌... భారత్‌ ‘డబుల్‌ సూపర్‌’...

Advertisement

తప్పక చదవండి

Advertisement