గాయంతో బాహుబలి.. బరువు తగ్గిన అరిసి కొంబన్‌ | Sakshi
Sakshi News home page

గాయంతో బాహుబలి.. బరువు తగ్గిన అరిసి కొంబన్‌

Published Sun, Jun 25 2023 9:36 AM

బహుబలి ఏనుగు,           అరిసి కొంబన్‌ ఏనుగు  - Sakshi

సాక్షి, చైన్నె: నోటి వద్ద తీవ్రగాయంతో బాహుబలి ఏనుగు, బరువు తగ్గి కనిపిస్తున్న అరిసి కొంబన్‌ ఏనుగు ఆరోగ్యంపై అటవీశాఖ అధికారులు దృష్టి పెట్టారు. వైద్య పరిశోధనలు, చికిత్సలకు సిద్ధమయ్యారు. ముందుగా బాహుబలిని పట్టుకుని వైద్య చికిత్సలు అందించేందుకు రెండు కుంకీ ఏనుగులను శనివారం రంగంలోకి దించారు.

బాహుబలి ఏనుగు కోయంబత్తూరు జిల్లాలోని అటవీ గ్రామాల ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని పలుమార్లు దట్టమైన అడవుల్లోకి పంపించినా మళ్లీ గ్రామాల్లోకి వస్తోంది. ప్రస్తుతం మళ్లీ అటవీ గ్రామాల్లోకి వచ్చిన బాహుబలి ఏనుగుకు నోటి వద్ద తీవ్ర గాయం అయినట్టు అధికారులు గుర్తించారు. దానికి చికిత్స అందించేందుకు అటవీ అధికారులు, వైద్యులు సిద్ధమయ్యారు.

శుక్రవారం రాత్రి నుంచి ఈ ఏనుగు కదలికలపై నిఘా పెట్టారు. మేట్టుపాళయం పరిసరాల్లో బాహుబలి ఉన్నట్టు గుర్తించారు. దీనిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ముదుమలై శరణాలయం నుంచి వశీం, విజయ్‌ అనే రెండు ఏనుగులను రంగంలోకి దించారు. ఈ ఏనుగుల ద్వారా బాహుబలిని మచ్చిక చేసుకుని మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి నోటి వద్ద గాయానికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

బరువు తగ్గిన అరిసి కొంబన్‌
తేని జిల్లాలోని అటవీ గ్రామాల ప్రజలను బెంబేలెత్తించిన అరిసి కొంబన్‌ ఏనుగును ఇటీవల పట్టుకున్న విషయం తెలిసిందే. దీన్ని కన్యాకుమారి జిల్లా కొచ్చియారు పరిధిలోకి తీసుకెళ్లి వదలి పెట్టారు. ఈ పరిసరాలలోనే అరిసి కొంబన్‌ తిరుగుతోంది. రేడియో కాలర్‌ అమర్చి దీని కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కొచ్చియారు తీరంలో తిరుగుతున్న ఈ ఏనుగు మరీ బరువు తగ్గి కనిపించడంతో ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.

దీంతో దీని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. హఠాత్తుగా ఏనుగు బరువు తగ్గడం అనుమానాలకు దారి తీస్తోంది. గత ఏడాది కాలంగా ఈ ఏనుగు గ్రామాల్లోకి చొరబడి ఇష్టానుసారంగా తనకు చిక్కిన ఆహారాన్ని తింటోంది. ప్రస్తుతం అడవుల్లో లభించే ఆహారం మాత్రమే తీసుకుంటున్న దృష్ట్యా బరువు తగ్గి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

1/1

Advertisement
Advertisement