నీకు మొగుడు లేడా..?
ఆమెకు ఉన్నా వెళ్లిపోయాడా..,?
మీ ఊళ్లో అందరూ ఇంతేనా
ఓటు ఫ్యాన్‌కు .. సమస్యలు మాకా..?
ఎస్సీ ఎస్టీ మహిళలపై టీడీపీ అభ్యర్థి గురజాల జగన్‌మోహన్ అనుచిత వ్యాఖ్యలు
గుడిపాల/చిత్తూరు అర్బన్: చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఎస్సీ, ఎస్టీ మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అందరి ఎదుటే దళిత మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి వెంటనే అతడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని.. ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలం కనకనేరి ఆది అంధ్రవాడలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
టీడీపీ చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలాజీ నాయుడు తదితరులు మందీ మార్బలంతో శనివారం కనకనేరి గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. ఇక్కడున్న ఆది ఆంధ్రవాడకు చెందిన మహిళలు యానాదులకు చెందిన మహిళలను ఓం శక్తి గుడి వద్దకు జగన్మోహన్ నాయుడు పిలిపించాడు. మీకు గ్రామంలో ఏం సమస్య ఉందో చెప్పాలని మహిళలను అడగగా.. నీటి సమస్య ఎక్కువగా ఉందని పారిశుద్ధ్యం సరిగా లేదని మహిళలు సమాధానమిచ్చారు. దీంతో టీడీపీ అభ్యర్థి జగన్మోహన్ నాయుడు ‘నేను ఐదేళ్ల ముందే వచ్చినప్పుడు మీకు చెప్పినాను కదా ఫ్యాన్‌కు ఓటేయవద్దు అని. నా మాట వినలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నారు, అనుభవించండి. ఓటు ఫ్యాన్ గుర్తుకు వేస్తారు, సమస్యలు మాకు చెబుతారా? ఎగేసుకొని పోయి ఓటు వేసినారు కదా ఫ్యానుకు.. అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ఈసారి మాకే ఓటేస్తామని మహిళలంతా వచ్చి దేవుని ఎదుట ప్రమాణం చేయాలని హుకుం జారీ చేశాడు. అంతటితో ఆగకుండా.. ‘ఏమిరా మీ ఊరులో పెళ్లిళ్లు చేసుకుని మొగుళ్లని వదిలేస్తారంట కదా.. ఆమేమో మొగుడ్ని వదిలేసాను అంటది ఈమేమో మొగుడు ఉండాడు యాడికో పోయినాడు అంటాది. మీ ఊరంతా ఇట్లాంటోల్లేనా ఉండేది’ అంటూ దళితుల మనోభావాలు కించపరిచేలా మాట్లాడాడు. ఇలాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపిస్తే దళితులపై ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే తగ్గకుండా చివర్లో తాము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామంటూ మహిళలంతా తేల్చి చెప్పడంతో జగన్మోహన్ నాయుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు కులాహంకారాన్ని వ్యక్తపరిచేలా జగన్మోహన్ నాయుడు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరుకు చెందిన మేయర్ అముద, మాజీ చైర్మన్ తదితరులు జగన్మోహన్ నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గుడిపాల మండలంలోని దళిత నాయకులు మాట్లాడుతూ గురజాల జగన్మోహన్ నాయుడును ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment