gurajala jaganmohan
-
మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
గుడిపాల/చిత్తూరు అర్బన్: చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఎస్సీ, ఎస్టీ మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అందరి ఎదుటే దళిత మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి వెంటనే అతడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని.. ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలం కనకనేరి ఆది అంధ్రవాడలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.టీడీపీ చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలాజీ నాయుడు తదితరులు మందీ మార్బలంతో శనివారం కనకనేరి గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. ఇక్కడున్న ఆది ఆంధ్రవాడకు చెందిన మహిళలు యానాదులకు చెందిన మహిళలను ఓం శక్తి గుడి వద్దకు జగన్మోహన్ నాయుడు పిలిపించాడు. మీకు గ్రామంలో ఏం సమస్య ఉందో చెప్పాలని మహిళలను అడగగా.. నీటి సమస్య ఎక్కువగా ఉందని పారిశుద్ధ్యం సరిగా లేదని మహిళలు సమాధానమిచ్చారు. దీంతో టీడీపీ అభ్యర్థి జగన్మోహన్ నాయుడు ‘నేను ఐదేళ్ల ముందే వచ్చినప్పుడు మీకు చెప్పినాను కదా ఫ్యాన్‌కు ఓటేయవద్దు అని. నా మాట వినలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నారు, అనుభవించండి. ఓటు ఫ్యాన్ గుర్తుకు వేస్తారు, సమస్యలు మాకు చెబుతారా? ఎగేసుకొని పోయి ఓటు వేసినారు కదా ఫ్యానుకు.. అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఈసారి మాకే ఓటేస్తామని మహిళలంతా వచ్చి దేవుని ఎదుట ప్రమాణం చేయాలని హుకుం జారీ చేశాడు. అంతటితో ఆగకుండా.. ‘ఏమిరా మీ ఊరులో పెళ్లిళ్లు చేసుకుని మొగుళ్లని వదిలేస్తారంట కదా.. ఆమేమో మొగుడ్ని వదిలేసాను అంటది ఈమేమో మొగుడు ఉండాడు యాడికో పోయినాడు అంటాది. మీ ఊరంతా ఇట్లాంటోల్లేనా ఉండేది’ అంటూ దళితుల మనోభావాలు కించపరిచేలా మాట్లాడాడు. ఇలాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపిస్తే దళితులపై ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే తగ్గకుండా చివర్లో తాము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామంటూ మహిళలంతా తేల్చి చెప్పడంతో జగన్మోహన్ నాయుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు కులాహంకారాన్ని వ్యక్తపరిచేలా జగన్మోహన్ నాయుడు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరుకు చెందిన మేయర్ అముద, మాజీ చైర్మన్ తదితరులు జగన్మోహన్ నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గుడిపాల మండలంలోని దళిత నాయకులు మాట్లాడుతూ గురజాల జగన్మోహన్ నాయుడును ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు తెలిపారు. -
నేను నిత్య విద్యార్థిని
తిరుచానూరు: తాను తన ఐదో ఏట నుంచి ఇప్పటికీ సంగీతం నేర్చుకుంటూనే ఉన్నానని, తాను నిత్య విద్యార్థినేగానీ విద్వాన్ కాదని కేజే ఏసుదాస్ అన్నారు. యూనిక్రాఫ్ట్ బ్యానర్‌పై చిత్తూరు జిల్లాకు చెందిన గురజాల జగన్మోహన్ నిర్మించిన మనలో ఒకడు సినిమా మిలియన్ క్లిక్స్ డిస్క్‌ను సోమవారం సాయంత్రం తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రముఖ కర్ణాటిక సంగీత, సినీ నేపథ్య గాయకులు కేజే ఏసుదాస్‌ను ఈ సందర్భంగా మనలో ఒకడు సినిమా యూనిట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ రంగంలోనైనా రాణించాలంటే ప్రతి రోజు సాధన చేయాలని, అలా చేసినప్పుడే భగవంతుని ఆశీస్సులు తోడై రాణించగలుగుతామన్నారు. గురువుల ఆశీర్వాదం, శ్రోతల అభిమానం, దేవుని ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకోగలిగానన్నారు. అందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు అంది, ఆయురారోగ్యం కలగాలని ప్రార్థిస్తూ పఠించిన శ్లోకం శ్రోతలను అలరించింది. అనంతరం ఏసుదాస్ చేతుల మీదుగా యూనిట్ సభ్యులకు షీల్డ్‌లను అందజేశారు. వ్యాఖ్యాతగా ఝాన్సీ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, ఎమ్మెల్యే తలారి ఆదిత్య, వైఎస్సార్ సీపీ నాయకులు జంగాలపల్లి శ్రీనివాసులు, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్, నేపథ్య గాయనీగాయకులు సునీత, శ్రవణlభార్గవి, హేమచంద్ర, సినిమా సహ నిర్మాతలు ఉమేష్‌గౌడ్, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.