వరుసగా మూడో విజయంతో ముందంజ
4 వికెట్లతో ఓడిన గుజరాత్ టైటాన్స్
చెలరేగిన డుప్లెసిస్, కోహ్లి, సిరాజ్
తొలి ఎనిమిది మ్యాచ్‌లలో ఒక విజయం, ఏడు పరాజయాలు... అంతా లెక్కలోంచి తీసేసిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పుంజుకుంది. ప్రత్యర్థి వేదికపై గత రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆర్‌సీబీ ఇప్పుడు సొంతగడ్డపై చెలరేగి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. పట్టికలో మూడు స్థానాలు ఎగబాకి పదినుంచి ఏడుకు చేరింది.
అయితే తాజా విజయంలో కాస్త ఉత్కంఠను పెంచి చివరకు గెలుపుతీరం చేరింది. ముందుగా తమ పేలవ ఆటను కొనసాగిస్తూ టైటాన్స్ 147 పరుగులకే పరిమితమైంది. సులువైన ల„ ్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌సీబీ స్కోరు 92/0...ఇక మిగిలింది లాంఛనమే అనుకున్న తరుణంలో 25 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడ్డాయి. కానీ తడబాటును అధిగమించి మరో 38 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో అభిమానులకు ఆర్‌సీబీ ఆనందం పంచింది. శనివారం జరిగిన కీలక పోరులో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది.
షారుఖ్ ఖాన్ (24 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తెవాటియా (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.
ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 35 బంతుల్లోనే 92 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. జోష్ లిటిల్‌కు 4 వికెట్లు దక్కాయి.
టపటపా...
సిరాజ్ బౌలింగ్ ధాటికి గుజరాత్ బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది. తన తొలి రెండు ఓవర్లలో సాహా (1), గిల్ (2)లను సిరాజ్ అవుట్ చేయగా, సుదర్శన్ (6)ను గిల్ వెనక్కి పంపించాడు. దాంతో పవర్‌ప్లేలో గుజరాత్ 23 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో షారుఖ్, మిల్లర్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.
కానీ మిల్లర్‌ను అవుట్ చేసి ఈ 61 పరుగుల భాగస్వామ్యానికి కరణ్ తెర దించగా...లేని పరుగు కోసం ప్రయత్నించి షారుఖ్ రనౌట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. ఆ తర్వాత తెవాటియా కాస్త దూకుడుగా ఆడటంతో గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది.
కరణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో తెవాటియా వరుసగా 4, 6, 4, 4 బాదాడు. యశ్ దయాళ్ ఒకే ఓవర్లో రషీద్ (18), తెవాటియాను అవుట్ చేసి దెబ్బ కొట్టగా...వైశాక్ వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతుల్లో ఒకే స్కోరు వద్ద గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయింది.
మెరుపు భాగస్వామ్యం...
ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ బౌండరీలు బాదుతూ వేగంగా లక్ష్యం దిశగా సాగిపోయారు. మోహిత్ వేసిన తొలి ఓవర్లో కోహ్లి 2 సిక్స్‌లు కొట్టగా, లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మానవ్ వేసిన తర్వాతి ఓవర్లోనూ సిక్స్, ఫోర్ కొట్టిన డుప్లెసిస్...మోహిత్ ఓవర్లో 4 ఫోర్లు బాది 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మానవ్ ఓవర్లో కోహ్లి 2 సిక్స్‌లు కొట్టగా...లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అదే జోరులో డుప్లెసిస్ అవుటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి 92 పరుగులు సాధించిన ఆర్‌సీబీ...ఐపీఎల్‌లో తమ అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. అయితే డుప్లెసిస్ వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ బృందం తడబడింది.
కొంత ఉత్కంఠ నెలకొన్నా... దినేశ్ కార్తీక్ (12 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు), స్వప్నిల్ సింగ్ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్‌కు అభేద్యంగా 35 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.
స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కార్తీక్ (బి) సిరాజ్ 1; గిల్ (సి) వైశాక్ (బి) సిరాజ్ 2; సుదర్శన్ (సి) కోహ్లి (బి) గ్రీన్ 6; షారుఖ్ (రనౌట్) 37; మిల్లర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కరణ్ 30; తెవాటియా (సి) వైశాక్ (బి) దయాళ్ 35; రషీద్ (బి) దయాళ్ 18; విజయ్‌శంకర్ (సి) సిరాజ్ (బి) వైశాక్ 10; మానవ్ (సి) స్వప్నిల్ (బి) వైశాక్ 1; మోహిత్ (రనౌట్) 0; నూర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–19, 4–80, 5–87, 6–131, 7–136, 8–147, 9–147, 10–147. బౌలింగ్: స్వప్నిల్ సింగ్ 1–0–1–0, సిరాజ్ 4–0–29–2, యశ్ దయాళ్ 4–0–21–2, గ్రీన్ 4–0–28–1, విజయ్‌కుమార్ వైశాక్ 3.3–0–23–2, కరణ్ శర్మ 3–0–42–1.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (సి) సాహా (బి) నూర్ 42; డుప్లెసిస్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 64; జాక్స్ (సి) షారుఖ్ (బి) నూర్ 1; పటిదార్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 2; మ్యాక్స్‌వెల్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 4; గ్రీన్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 1; కార్తీక్ (నాటౌట్) 21; స్వప్నిల్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.4 ఓవర్లలో 6 వికెట్లకు) 152 వికెట్ల పతనం: 1–92, 2–99, 3–103, 4–107, 5–111, 6–117. బౌలింగ్: మోహిత్ శర్మ 2–0–32–0, జోష్ లిటిల్ 4–0–45–4, మానవ్ సుథర్ 2–0–26–0, నూర్ అహ్మద్ 4–0–23–2, రషీద్ ఖాన్ 1.4–0–25–0.
ఐపీఎల్‌లో నేడు
పంజాబ్ X చెన్నై
వేదిక: ధర్మశాల
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి
లక్నో X కోల్‌కతా
వేదిక: లక్నో
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment