బెంగళూరు అద్భుతం | RCB has made it to the play offs | Sakshi
Sakshi News home page

బెంగళూరు అద్భుతం

Published Sun, May 19 2024 4:33 AM | Last Updated on Sun, May 19 2024 3:53 PM

RCB has made it to the play offs

ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్‌సీబీ

చివరి మ్యాచ్‌లో ఘన విజయం 

27 పరుగులతో ఓడిన చెన్నై  

బెంగళూరుతో మ్యాచ్‌లో చెన్నై విజయలక్ష్యం 219 పరుగులు...కానీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే 201 పరుగులే చేస్తే చాలు...తడబడుతూనే సాగిన ఛేదన చివరిలో ఉత్కంఠను పెంచింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేస్తే చాలు...  ఐపీఎల్‌ ప్రమాణాలు, ఈ సీజన్‌లో ఆట చూస్తే ఇది సునాయాసమే అనిపించింది. 

యశ్‌ దయాళ్‌ వేసిన తొలి బంతినే ధోని సిక్సర్‌గా మలచడంతో చెన్నై బృందంలో ఆనందం. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా నిలిచింది. కానీ రెండో బంతికి ధోని అవుట్‌ కావడంతో పరిస్థితి మారిపోయింది. తర్వాతి రెండు బంతుల్లో శార్దుల్‌ సింగిల్‌ మాత్రమే తీయగా...చివరి రెండు బంతులకు జడేజా బ్యాట్‌ కూడా తగిలించలేకపోయాడు! దాంతో ఆర్‌సీబీ సంబరాలు షురూ అయిపోయాయి. 

టోర్నీ తొలి 8 మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచి వరుసగా 6 ఓడి అందరూ లెక్కలోంచి తీసేసిన తర్వాత బెంగళూరు అద్భుతం చేసింది. ఇప్పుడు వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆర్‌సీబీ సమష్టితత్వం ముందు ఓడిన సూపర్‌ కింగ్స్‌ లీగ్‌ దశకే పరిమితమైంది. ఇక మిగిలింది ధోని తన చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడేశాడా అనే చర్చ మాత్రమే!   

బెంగళూరు: ఐపీఎల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సారి లీగ్‌ దశలో నిష్క్రమించింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో విజయాల పోరాటం చేస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) 27 పరుగులతో గెలిచి ‘ప్లే ఆఫ్స్‌’కు అర్హత సాధించింది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. 

డుప్లెసిస్‌ (39 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (29 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), రజత్‌ పటిదార్‌ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించారు. అనంతరం చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడింది. రచిన్‌ రవీంద్ర (37 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), జడేజా (22 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.  

కోహ్లి, డుప్లెసిస్‌ దూకుడు 
రెండో ఓవర్‌ నుంచే ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్‌లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. మూడో ఓవర్లో కోహ్లి రెండు భారీ సిక్సర్లు బాదగా... వర్షం వచ్చి మ్యాచ్‌ను ఆపేసింది. అప్పుడు ఆర్సీబీ స్కోరు 31/0. తర్వాత తెరిపినిచ్చాక స్పిన్‌ ప్రయోగంతో వేగం తగ్గింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది. 

జడేజా, సాన్‌ట్నర్‌ బౌలింగ్‌లో సిక్స్‌లు బాదిన కోహ్లి అదే ఊపులో మరో సిక్సర్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్‌ వద్ద మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.  పటిదార్‌ క్రీజులోకి రాగా డుప్లెసిస్‌... జడేజా వేసిన 11వ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లు బాదాడు. 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరగా డుప్లెసిస్‌ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 

కాసేపటికే సందేహాస్పద రనౌట్‌తో డుప్లెసిస్‌ క్రీజ్‌ వీడాడు. ఈ దశలో లైఫ్‌ వచ్చిన గ్రీన్‌ (17 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పటిదార్‌తో కలిసి ధనాధన్‌ ఆటతీరుతో బెంగళూరు ఇన్నింగ్స్‌ను వేగంగా నడిపించాడు. 15 ఓవర్లలో 138/2 స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటర్ల జోరు మరింత పెరిగింది. చివరి 5 ఓవర్లలో బెంగళూరు 80 పరుగులు రాబట్టడం విశేషం.  

రాణించిన రచిన్‌ 
ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌ వేసిన మ్యాక్స్‌వెల్‌ తొలి బంతికే కెప్టెన్‌ రుతురాజ్‌ (0)ను డకౌట్‌ చేశాడు. తర్వాత మిచెల్‌ (4) కోహ్లి క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఈ దశలో రహానే, రచిన్‌ రవీంద్ర వికెట్‌కు ప్రాధాన్యమివ్వడంతో వేగం మందగించింది. మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించాక రహానె (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) నిష్క్రమించాడు. 

రచిన్‌ 31 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్వల్ప వ్యవధిలో రచిన్‌ రనౌట్‌ కాగా,  దూబే (7)ను గ్రీన్‌ పెవిలియన్‌ చేర్చాడు. సాన్‌ట్నర్‌ (3)ను డుప్లెసిస్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో పంపించాడు. ఈ దశలో జడేజా, ధోని (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆశలు రేపారు. 

స్కోరు వివరాలు 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) మిచెల్‌ (బి) సాన్‌ట్నర్‌ 47; డుప్లెసిస్‌ రనౌట్‌ 54; పటిదార్‌ (సి) మిచెల్‌ (బి) శార్దుల్‌ 41; గ్రీన్‌ నాటౌట్‌ 38; దినేశ్‌ కార్తీక్‌ (సి) ధోని (బి) తుషార్‌ 14; మ్యాక్స్‌వెల్‌ (సి) ధోని (బి) శార్దుల్‌ 16; మహిపాల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–78, 2–113, 3–184, 4–201, 5–218. బౌలింగ్‌: తుషార్‌ 4–0–49–1, శార్దుల్‌ 4–0–61–2, తీక్షణ 4–0–25–0, సాన్‌ట్నర్‌ 4–0–23–1, జడేజా 3–0–40–0, సిమర్‌జీత్‌ 1–0–19–0. 

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) యశ్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 0; రచిన్‌ రనౌట్‌ 61; మిచెల్‌ (సి) కోహ్లి (బి) యశ్‌ 4; రహానె (సి) డుప్లెసిస్‌ (బి) ఫెర్గూసన్‌ 33; దూబే (సి) ఫెర్గూసన్‌ (బి) గ్రీన్‌ 7; జడేజా నాటౌట్‌ 42; సాన్‌ట్నర్‌ (సి) డుప్లెసిస్‌ (బి) సిరాజ్‌ 3; ధోని (సి) స్వప్నిల్‌ (బి) యశ్‌ 25; శార్దుల్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–85, 4–115, 5–119, 6–129, 7–190. బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 4–0–25–1, సిరాజ్‌ 4–0–35–1, యశ్‌ 4–0–42–2, స్వప్నిల్‌ 2–0–13–0, కరణ్‌ శర్మ 1–0–14–0, ఫెర్గూసన్‌ 3–0–39–1, గ్రీన్‌ 2–0–18–1.  

ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్‌ X  పంజాబ్‌
వేదిక: హైదరాబాద్‌
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి

రాజస్తాన్‌  X  కోల్‌కతా
వేదిక: గువహటి
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement