రెండే ఓవర్లలో 44 పరుగుల నుంచి 100 నాటౌట్
16 ఓవర్లలోనే 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు
మెరిపించిన విరాట్ కోహ్లి
గుజరాత్ టైటాన్స్‌కు ఆరో ఓటమి
బెంగళూరు గెలిచేందుకు 6 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. కోహ్లి 69 పరుగులతో... విల్ జాక్స్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక్కడ సెంచరీ అయితే గియితే కోహ్లిదే అవుతుంది లేదంటే లేదు! కానీ ఎవరూ ఊహించని విధంగా జాక్స్ రెండే ఓవర్లలో సెంచరీ పూర్తి చేశాడు.
మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో జాక్స్ 4, 6, నోబాల్ 6, 2, 6, 4, 0లతో 29 పరుగులు సాధించాడు. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి కోహ్లి ఒక పరుగు తీసి జాక్స్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. జాక్స్ వరుసగా 6, 6, 4, 6, 6లతో 28 పరుగులు పిండుకొని సంచలన శతకం సాధించి అబ్బురపరిచాడు.
జాక్స్ 29 బంతుల్లో 44 పరుగులు చేయగా... ఆ తర్వాత 12 బంతుల్లో ఏకంగా 56 పరుగులు సాధించి సెంచరీ మైలురాయిని అందుకోవడం విశేషం.
అహ్మదాబాద్: మళ్లీ బౌలర్ డీలా... బంతేమో విలవిల... బ్యాట్ భళా! అంతే మరో 200 పైచిలుకు స్కోరు... దీన్ని 16 ఓవర్లలోనే ఛేదించిన తీరు చూస్తుంటే ఈ వేసవి వడగాడ్పులతో వేడెక్కించడమే కాదు... ఐపీఎల్ సిక్సర్లతో కిక్ ఎక్కిస్తోంది! ప్లే ఆఫ్స్ రేసుకు దాదాపు దూరమనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇంటాబయటా పరుగుల హోరెత్తిస్తోంది.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై జయభేరి మోగించింది. 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఉఫ్‌మని ఊదేసింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీస్కోరు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), షారుఖ్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగారు.
అనంతరం ఆర్‌సీబీ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 206 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సిక్సర్లతో హోరెత్తించారు.
జాక్స్ 2 ఓవర్ల విధ్వంసంతో...
కోహ్లితో ఛేదన ప్రారంభించిన డుప్లెసిస్ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) నాలుగో ఓవర్లో నిష్క్రమించాడు. సాయికిశోర్ వేసిన ఆ ఓవరే వికెట్ దక్కించుకుంది. ఆ తర్వాత ఎవరూ బౌలింగ్‌కు దిగినా... పరుగులు, ఈ దశ దాటి మెరుపులు... దాన్ని మించి ఉప్పెనే! పవర్‌ప్లేలో బెంగళూరు 63/1 స్కోరు చేసింది.
సగం ఓవర్లు ముగిసేసరికి 98/1 అంటే వంద కూడా చేయని జట్టు ఇంకో 6 ఓవర్లు ముగిసేసరికే 108 పరుగుల్ని చేసి మ్యాచ్‌నే ముగించింది. కోహ్లి 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నప్పుడు జాక్స్ 16 బంతుల్లో 16 పరుగులే చేశాడు. 14 ఓవర్లలో బెంగళూరు స్కోరు 148/1.
ఈ దశలో మోహిత్ వేసిన 15వ ఓవర్లో, రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జాక్స్ విశ్వరూపం ప్రదర్శించడంతో ఆర్‌సీబీ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించి విజయతీరానికి చేరింది.
స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కరణ్ శర్మ (బి) స్వప్నిల్ 5; గిల్ (సి) గ్రీన్ (బి) మ్యాక్స్‌వెల్ 16; సుదర్శన్ (నాటౌట్) 84; షారుఖ్ (బి) సిరాజ్ 58; మిల్లర్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–6, 2–45, 3–131. బౌలింగ్: స్వప్నిల్ 3–0–23–1, సిరాజ్ 4–0–34–1, యశ్ దయాళ్ 4–0–34–0, మ్యాక్స్‌వెల్ 3–0–28–1, కరణ్ శర్మ 3–0–38–0, గ్రీన్ 3–0–42–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 70; డుప్లెసిస్ (సి) సబ్–శంకర్ (బి) సాయికిశోర్ 24; విల్ జాక్స్ (నాటౌట్) 100; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో వికెట్ నష్టానికి) 206. వికెట్ల పతనం: 1–40. బౌలింగ్: అజ్మతుల్లా 2–0–18–0, సందీప్ 1–0–15–0, సాయికిశోర్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–51–0, నూర్ అహ్మద్ 4–0–43–0, మోహిత్ 2–0–41–0.
ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా X ఢిల్లీ
వేదిక: కోల్‌కతా
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment