ఓటర్‌ కార్డు లేకున్నా ఓటేయొచ్చు..! | Sakshi
Sakshi News home page

ఓటర్‌ కార్డు లేకున్నా ఓటేయొచ్చు..!

Published Thu, Oct 19 2023 5:15 AM

Central Election Commission New Guidelines for Voters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్‌)లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయిన పక్షంలో ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్వో) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును ఆధారంగా చూపి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్‌ కేంద్రంలో ఉన్న ఓటును వినియోగించుకోవడానికి వచ్చే వారికి (ఆ పోలింగ్‌ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరున్న వారికి) సైతం ఓటు హక్కు కల్పించాలని సూచించింది.

ఓటరు గుర్తింపు కార్డు లేనిపక్షంలో, ఒకవేళ ఉన్నా గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో పోలింగ్‌ రోజు ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను తీసుకువస్తే ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది. తెలంగాణ సహా మరో 4 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటరు గుర్తింపు నిర్థారణ విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ సీఈసీ ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు (సీఈఓలకు) లేఖ రాసింది.  

ఇలాంటి పరిస్థితుల్లో గుర్తింపు తప్పనిసరి.. 
ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు పత్రాల్లో (కింద జాబితాలో చూడవచ్చు) ఏదో ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.

ప్రవాస భారత ఓటర్లు తమ పాస్‌పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది. పోలింగ్‌కు కనీసం 5 రోజుల ముందు పోలింగ్‌ కేంద్రం పేరు, తేదీ, సమయం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్‌ ఇన్‌ఫర్మేషన్‌ స్లిప్పులను జారీ చేయాలని ఆదేశించింది. అయితే వీటిని ఓటరు గుర్తింపుగా పరిగణించరాదని స్పష్టం చేసింది.  

ప్రత్యామ్నాయ ఫోటో ధ్రువీకరణ పత్రాలివే..  
– ఆధార్‌కార్డు 
– ఉపాధి హామీ జాబ్‌ కార్డు 
– బ్యాంకు/తపాల కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్‌ 
– కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు 
– డ్రైవింగ్‌ లైసెన్స్‌ 
– పాన్‌కార్డు 
– రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్, ఇండియా (ఆర్జీఐ).. నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌(ఎనీ్పఆర్‌) కింద జారీ చేసిన స్మార్ట్‌ కార్డు  
– భారతీయ పాస్‌పోర్టు 
– ఫోటో గల పెన్షన్‌ పత్రాలు  
– కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు 
– ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు 
– కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్‌ డిజెబిలిటీ గుర్తింపు కార్డు (యూడీఐడీ)    

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement