అవకాశం వస్తే రాజకీయాల్లోకి: ఊర్మిళ | Sakshi
Sakshi News home page

అవకాశం వస్తే రాజకీయాల్లోకి దిగుతా: ఊర్మిళ

Published Fri, Jul 17 2020 6:55 PM

If Have Chance Will Come To Politics Says Urmila Gajapathi raju - Sakshi

సాక్షి, విజయనగరం: తన తండ్రి మరణం అనంతరం అశోక గజపతిరాజు అనేక రాజకీయ కుట్రలకు ప్రయత్నించారని ఆనంద గజపతిరాజు, సుధా కూతురు ఊర్మిళా గజపతిరాజు విమర్శించారు. సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో మా బాబాయ్ రాజకీయం చేయడం తమను ఎంతో బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ నుంచి తమను ఉద్దేశపూర్వకంగా దూరం చేయాలని అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. తన తండ్రి మరణం అనంతరం ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తున్నా అని, భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పనిసరిగా రాజకీయాల్లో దిగుతానని ఊర్మిళ తెలిపారు. అనంద గజపతి రాజు 70వ జన్మదినం సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. (సంచయితపై బాబు, అశోక్‌ రాజకీయ కుట్ర)

‘నాన్న ఆనంద గజపతిరాజు గారు నిత్యం ప్రజల కోసం ఆలోచించే వారు. ఆనంద గజపతిరాజు చాలా సాధారణ జీవితం గడిపారు. ఆయన ఎప్పుడూ పీవీజీ రాజు (తాత) ఆశయాలను కొనసాగించడం కోసమే పనిచేశారు. అందులో భాగంగానే ఇంజినీరింగ్ కాలేజీలు స్ధాపించడం, మాన్సాస్ ట్రస్ట్ బాగా నడిపించడం చేశారు. మెడికల్ కాలేజీ పెట్టాలి అనేది నాన్నగారి కల. ఆయన బ్రతికి ఉండి ఉంటే తప్పనిసరిగా మెడికల్ కాలేజీ నిర్మించేవారు. కుటుంబ సభ్యులను కాకుండా ఆయన దగ్గర పనిచేసే వారిని కూడా చాలా బాగా చూసుకునే వారు. మా నాన్న మరణించేటప్పటికి నా వయసు 16 సంవత్సరాలు. మా బాబాయ్  మా నాన్న మరణం తర్వాత ట్రస్ట్ బాధ్యతలు చేపట్టడానికి మాకు అర్హత లేదన్నారు. (చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్‌!)



తాతగారు ఏ ఉద్దేశంతో ట్రస్ట్ పెట్టారో మా నాన్న ఆనంద గజపతిరాజు దాన్ని అలాగే కొనసాగించారు. దురదృష్టవశాత్తు నాన్న మరణం తర్వాత బాబాయి ఆ ఉద్దేశంతో ట్రస్ట్ కొనసాగించలేదు. అశోక్‌ను చైర్మన్‌గా టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన సమయంలో కనీసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో మమ్మల్ని బాగా బాధ పెట్టింది. ఆ జీవోని ఉపయోగించుకుని మమ్మల్ని ట్రస్ట్‌కు దూరం చేశారు. నాన్న మరణం తర్వాత సింహాచలం దేవస్థానం వేడుకలకు ఆహ్వానించడం జరగలేదు. భవిష్యత్తులో మా నాన్న, మా తాత గారు లా ప్రజలకు సేవ చేస్తా. అవకాశం వస్తే తప్పనిసరిగా రాజకీయాల్లోకి వస్తా’ అంటూ తన మనసులోని మాటను చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement