‘ఉపాధి’ జోరు | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ జోరు

Published Tue, Mar 20 2018 1:04 PM

‘Upadhi’ scheme under way - Sakshi

ఆదిలాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకానికీ అనుసంధానం చేస్తోంది. ఎక్కడ చూసిన ఉపాధి.. ఏ పథకం ప్రవేశపెట్టినా ఉపాధి హామీ పథకం కిందనే చేపడుతోంది. ఇలా ప్రతి దానికి ఈ పథకాన్ని అనుసంధానం చేయడంతో కూలీలకు చేతినిండా పని లభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వ్యవసాయం, హరితహారం, మిషన్‌కాకతీయ, రోడ్ల నిర్మాణం, పశువుల పాకలు, ఫారంఫండ్లు.. డంపింగ్‌యార్డు, పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు.. ఇలా ప్రతీ దాన్ని ఉపాధి హామీ పథకంలో చేయిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశమంతటా ఈ పథకానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతాఇంత కాదు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు. దీంతో ఉపాధి కూలీలకు చేతినిండా పనులు దొరుకుతున్నాయి. ఆ పథకం కింద సుమారు 52 రకాల పనులు చేస్తున్నారు. జిల్లాలో 1,51,583 మంది జాబ్‌కార్డులు ఉండగా.. 3,22,000 వేల మంది కూలీలు ఉన్నారు. గత ఏడాది 60 లక్షల పని దినాలు లక్ష్యం కాగా.. 31.22లక్షల పని దినాలు కల్పించారు.

తాజాగా సంతల ఏర్పాటు..
గ్రామాల్లో సంతలు(అంగళ్లు) నిర్వహించుకోవడానికి వీలుగా గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద షెడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానికుల అవసరాలు తీర్చడంలో భాగంగా పండ్లు, కూరగాయలు, తినుబండరాలు, సామగ్రి తదితర వాటిని విక్రయించుకునేందుకు వసతులు కల్పించనుంది. ఈ మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు, దాతలు చొరవ తీసుకుంటే త్వరగా అంగళ్ల నిర్వహణకు అనువైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. అవసరమైన మౌలిక వసతులను రెండు కేటగిరీల్లో కల్పించుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

20 గదులు, 30 గదుల విస్తీర్ణంలో అభివృద్ధి చేసుకునేలా అవకాశం ఇచ్చారు. గ్రామ జనాభా, స్థలం, నిధుల లభ్యత తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని గ్రామ పంచాయతీలే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 30 గదులకు రూ.15 లక్షలు, 20 గదులకు రూ.10 లక్షలు కేటాయించనున్నారు. వీటిని ప్లాట్‌ఫాం, నీటి వసతి, మూత్రశాలలు, డ్రైనేజీలు, పార్కింగ్‌ స్థల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంగళ్ల నిర్వహణ ద్వారా గ్రామ పంచాయతీలు ఆదాయాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. వేలం పాట స్థలం కేటాయింపు లేదా అంగళ్లలో విక్రయించే వారి నుంచి పన్నులు కూడా వసూలు చేసుకోవచ్చు. 

వ్యవసాయ పనులకు..
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రవేశపెట్టే దేశ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోంది. దీనిలో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తోంది. గ్రామీణులకు ఉన్న ఊర్లోనే పనిచేసుకుని జీవించేందుకు రూపొందించిన ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చుతోంది. వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడం వల్ల బీడు భూములు సాగులోకి రావడంతోపాటు పాడిపరిశ్రమ, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పాకల నిర్మాణాలు చేపడుతోంది. ఊటకుంటలు, ఫారంఫండ్‌లు, నీటి నిల్వ కుంటలు ఏర్పాటు చేస్తున్నారు. సేంద్రియ ఎరువులతో భూమిని సారవంతం చేసుకొని వర్మీకంపోస్టు యూనిట్లు తయారు చేసుకోవచ్చు. పశువుల తొట్టెలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 

హరితహారంలో..
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉపాధి హామీ పథకంలో హరితహార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే హరితహారం కింద నాటే మొక్కలు ఉపాధి పనులతోనే చేయిస్తున్నారు. జిల్లాలోని వివిధ నర్సరీల్లో ఉపాధి కూలీలతో మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ ఏడాది కోటి మొక్కల లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. మొక్కలు నాటడం, వాటి రక్షణ చర్యలకు సైతం ఉపాధి పనుల్లోనే వినియోగిస్తున్నారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ఉపాధి నిధులు వెచ్చిస్తున్నారు. సీసీ రోడ్లకు 90 శాతం నిధులు ఈ పథకం నుంచి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని చాలా గ్రామాల్లో ఉపాధి కింద వేసిన రోడ్లు పూర్తయ్యాయి. మిషన్‌ కాకతీయ కింద చేపట్టే పనులు సైతం చేపడుతున్నారు. చెరువులో తీయడం ఈ పథకం కింద చేస్తున్నారు. 

అటవీ భూముల్లో..
ఉపాధి పథకం కింద అటవీ భూముల్లో నీటి సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. పెద్ద ఎత్తున నీటి, ఊటకుంటల తవ్వకాలు చేపడుతున్నారు. అటవీభూములు ఆక్రమణలకు గురికాకుండా సరిహద్దు చుట్టూ కందకాలు తవ్వుతున్నారు. దీని ద్వారా బయట నుంచి భూమిని కాపాడుకోవచ్చు. ఈ భూముల్లో వర్షపునీటి వరదకు మట్టికోతకు గురికాకుండా, భూమిలో తేమ సాంద్రత ఎక్కువ కాలం నిలిపే ప్రక్రియలో భాగంగా ఈ ఉపాధి పనులకు శ్రీకారం చుట్టారు. వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేయడం ద్వారా మట్టిలో తేమ ఉంటుంది. తద్వారా మొక్కలు చనిపోకుండా మనుగడ సాగిస్తాయి. ఫలితంగా హరిత శాతం పెరగడంతోపాటు వన్యప్రాణులకు వేసవిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. 

సద్వినియోగం చేసుకోవాలి..
ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ప్రతి పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధి కూలీలకు పని కల్పించడంతోపాటు రైతులకు సంబంధించిన నిర్మాణాలు ఈ పథకం కింద చేపడుతున్నాం. ఎక్కువగా వ్యవసాయ పనులకు అనుసంధానం చేయడం, నీటి లభ్యతను పెంచే నిర్మాణాలు చేపడుతున్నాం. 
– రాథోడ్‌ రాజేశ్వర్, డీఆర్‌డీవో

Advertisement
 
Advertisement
 
Advertisement