సిగ్నల్‌ లేకపోయినా క్షణాల్లో సమాచారం | Sakshi
Sakshi News home page

సిగ్నల్‌ లేకపోయినా క్షణాల్లో సమాచారం

Published Wed, Aug 16 2023 3:49 AM

New technology for of fishermen - Sakshi

సాక్షి, అమరావతి: మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తు­న్న రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో మత్స్య సంపదను వేటాడే వేళ గంగపుత్రులు ఆపదలో చిక్కుకుంటే.. రక్షించేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్‌ అండ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  

సెల్‌ సిగ్నల్‌ అందకపోయినా.. రక్షణ పరిధిలోకి 
తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్‌ మైళ్ల వరకు రాష్ట్ర పరిధిలో ఉండగా.. 12 నుంచి 200 నాటికల్‌ మైళ్ల వరకు దేశీయ జలాలు. 200 నాటికల్‌ మైళ్ల దూరం దాటితే అంతర్జాతీయ జలా­లుగా పరిగణిస్తారు. సంప్రదాయ, నాన్‌ మోటరైజ్డ్‌ బోట్లు తీరం నుంచి 4 నాటికల్‌ మైళ్ల వరకు వెళ్తుంటాయి. మోటరైజ్డ్‌ బోట్లు 12 నాటికల్‌ మైళ్ల వరకు, మెకనైజ్డ్‌ బోట్లు 12 నుంచి 200 నాటికల్‌ మైళ్ల వరకు వెళ్లి వేట సాగిస్తుంటాయి. రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22 వేల మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి.

వీటిపై ఆధారపడి 1.60 లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఇప్పటివరకు వేట సాగించే మత్స్యకారులకు ఇన్‌కాయిస్‌ సంస్థ శాటిలైట్‌ ద్వారా సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాలను (పీఎఫ్‌జెడ్‌–పొటెన్షియల్‌ ఫిషింగ్‌ జోన్స్‌) గుర్తించి బోట్లలో అమర్చే ఆటోమేటిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఏఐఎస్‌), మత్స్య శాఖ అభివృద్ధి చేసిన మొబైల్‌ యాప్స్‌ ద్వా­రా 12 నాటికల్‌ మైళ్ల పైబడి దూరం వెళ్లే మెకనైజ్డ్‌ బోట్లకు సమాచారం అందిస్తున్నాయి.

ఈ సమాచారం సంప్రదాయ, మోటరైజ్డ్‌ బోట్లకు అందించే అవకాశం లేదు. పైగా ఇది 2–3 రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. మరో వైపు ఏదైనా ఆపదలో ఉంటే తమ క్షేమ సమాచారం మొబైల్స్‌కు ఉండే సిగ్నల్స్‌పై ఆధారపడి ఉంటుంది. సిగ్నల్‌ మిస్‌ అయితే తీరానికి కమ్యూనికేషన్‌ పూర్తిగా తెగిపోతుంది. ఈ పరిస్థితికి ఇక చెక్‌ పెడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. 

100 శాతం సబ్సిడీపై.. 
కమ్యూనికేషన్‌ అండ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (ట్రాన్స్‌పాండర్‌)ను 12 నాటికల్‌ మైళ్లకు పైబడి దూరం వెళ్లే మరబోట్లు, మెకనైజ్డ్‌ బోట్లకు అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.36,400 విలువైన ఈ పరికరాన్ని 100 శాతం సబ్సిడీతో అమర్చనున్నారు. తీరంలో గస్తీ కోసం అభివృద్ధి చేసిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ (నావిక్‌), జీపీఎస్‌ శాటిలైట్స్‌తో ఈ డివైస్‌ అనుసంధానమై పనిచేస్తుంది.

బోట్లలోని మత్స్యకారుల వద్ద ఉండే స్మార్ట్‌ ఫోన్లను బ్లూటూత్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకుంటే చాలు సిగ్నల్‌తో సంబంధం లేకుండా రెండువైపులా సమాచారాన్ని పరస్పరం పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 

సమయం వృథా కాకుండా.. 
మరోవైపు ఇన్‌కాయిస్‌ సంస్థ అందించే పీఎఫ్‌జెడ్‌ సమాచారాన్ని కచ్చితమైన లొకేషన్స్‌తో బోట్లలోని మత్స్యకారులకు పంపడం వలన వారు క్షణాల్లో అక్కడకు చేరుకొని వేట సాగించడం ద్వారా సమయం, ఆయిల్‌ ఆదా అవుతుంది. పట్టుబడిన మత్స్యసంపదను ఏ సమయంలో ఏ రేవుకు తీసుకొస్తే మంచి రేటు వస్తుందో కూడా ఈ డివైస్‌ ద్వారా సమాచారం పంపిస్తారు.

దీంతో తీరానికి చేరుకున్న తర్వాత తగిన ధర లేక మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఉండదు. అయితే ఈ డివైస్‌ పనిచేయాలన్నా, సిగ్నల్‌తో సంబంధం లేకుండా స్మార్ట్‌ ఫోన్‌ పనిచేయాలన్నా.. సంబంధిత బోట్లలో రీ జనరేట్‌ చేసుకునే పవర్‌ సిస్టమ్‌ అవసరం ఉంటుంది. 

వైపరీత్యాల వేళ అప్రమత్తం చేయొచ్చు
తుపాను హెచ్చరికలు, అకాల వర్షాలు, ఈదురు గాలు­లకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైస్‌ ద్వారా లోతు జలాల్లో వేట సాగించే అన్నిరకాల బోట్లకు క్షణా­ల్లో పంపించి వారిని అప్రమత్తం చేయవచ్చు. లోతు జలాల్లో ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా తీరానికి చేరుకునేలా హెచ్చరికలు జారీ చేయొచ్చు.

ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే ఈ డివైస్‌ ద్వారా సమాచారం పంపితే శాటిలైట్‌ ద్వారా గ్రౌండ్‌ స్టేషన్‌కు చేరుతుంది. అక్కడ నుంచి క్షణాల్లో ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేçస్తున్న మోనిటరింగ్‌ స్టేషన్స్‌తోపాటు కోస్ట్‌ గార్డు, మెరైన్, నేవీ విభాగాలతోపాటు సమీపంలో ఉండే కమర్షియల్‌ వెసల్స్‌కు కూడా సమాచారం అందిస్తారు. తద్వారా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ప్రాణా­లతో రక్షించే అవకాశం ఉంటుంది.

దశల వారీగా అమర్చుతాం 
కమ్యూనికేషన్‌ అండ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (ట్రాన్స్‌­పాండర్‌)ను లోతు జలాల్లో మత్స్య వేట సాగించే బోట్లకు దశల వారీగా అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి దశలో 4,484 బోట్లలో అమర్చనున్నాం. అక్టోబర్‌ నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. – వీవీ రావు, జేడీ, మత్స్య శాఖ (సముద్ర విభాగం)  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement