టీటీడీ వార్షిక బడ్జెట్‌ రూ.5,141.74 కోట్లు | Sakshi
Sakshi News home page

టీటీడీ వార్షిక బడ్జెట్‌ రూ.5,141.74 కోట్లు

Published Tue, Jan 30 2024 4:20 AM

TTD board approves annual budget for Rs 5174 cr for 2024 - Sakshi

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చైర్మన్‌ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. వార్షిక బడ్జెట్‌తోపాటు పలు కీలక నిర్ణయాలకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపినట్లు భూమన వెల్లడించారు.

దాదాపు 30ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి టీటీడీ పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్నవారికి, శిల్పులకు వేతనాలు, వేదపారాయణదారులకు పెన్షన్, కాంట్రాక్టు అర్చకులు, సంభావన అర్చకులు, వేద పాఠశాలల్లోని సంభావన అధ్యాపకుల వేతనాలను, క్రమాపాఠీలు, ఘనాపాఠీలకు సంభావనలు పెంచినట్లు వివరించారు.

టీటీడీ నిర్వహిస్తున్న 26 స్థానిక ఆలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో 515 పోస్టులు సృష్టించేందుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ రూ.1,167 కోట్లు వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు రూ.1,611 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.600 కోట్లు, దర్శనం ద్వారా రూ.338 కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు చెప్పారు.

అదేవిధంగా పరికరాల కొనుగోలు కోసం రూ.751కోట్లు, కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.750 కోట్లను బడ్జెట్‌లో కేటాయించామని, మానవ వనరుల ఖర్చు రూ.1,733 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారానికి రూ.108.50కోట్లు కేటాయించినట్లు భూమన వివరించారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్‌ రోడ్డు ఏర్పాటు టెండరుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, పలువురు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

మహిళలకు శ్రీవారి ఆశీస్సులు అందించిన మంగళ సూత్రాలు
సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాల(తాళిబొట్లు)ను మహిళలకు అందించాలని టీడీపీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి మంగళసూత్రాలు తయారు చేయిస్తారు. ఆ మంగళసూత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభ, నష్టాలు లేని ధర నిర్ణయించి విక్రయిస్తారు.

నాలుగైదు డిజైన్లలో తయారు చేసే ఈ మంగళ సూత్రాలు 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో ఉంటాయి. ఇప్పటికే వివాహం అయినవారు, వివాహం చేసుకోబోయే వధువులు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘసుమంగళిగా ఉంటారని భక్తుల విశ్వాసం. భూమన కరుణాకరరెడ్డి గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిర్వహించిన కల్యాణమస్తు (సామూహిక వివాహాలు) ద్వారా సుమారు 32వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాలు ఉచితంగా అందించారు.

Advertisement
Advertisement