పవన్‌ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి: వలంటీర్‌ ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

పవన్‌ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి: వలంటీర్‌ ఫిర్యాదు

Published Sat, Aug 19 2023 6:03 AM

Women Volunteer to Case Filed Against Pawan Kalyan  - Sakshi

విజయవాడ: ఒంటరి మహిళల సమాచారాన్ని వలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాయని విజయవాడ శాంతినగర్‌కు చెందిన వలంటీర్‌ రంగవల్లి న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో వలంటీర్లనుద్దేశించి ఏలూరులో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై విజయవాడలోని పలువురు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

పోలీసులు పట్టించుకోకపోవడంతో వలంటీర్‌ రంగవల్లి నేరుగా విజయవాడ మెట్రోపాలిటన్‌ మేజ్రిస్టేట్‌ కోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి శుక్రవారం రికార్డు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఒగ్గు గవాస్కర్, మరో 25 మంది న్యాయవాదుల సమక్షంలో కోర్టు హాల్లో గంటన్నరపాటు ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సేకరించారు. ‘పవన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు అన్ని దినపత్రికలు, వార్తా చానళ్లు, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం, ట్విట్టర్‌లలో వచ్చాయి. పవన్‌ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని నేను నివాసం ఉంటున్న, విధులు నిర్వర్తిస్తున్న ప్రాం­తంలో కొందరు సూటిపోటి మాటలతో మన­సు గాయపరుస్తున్నారు.

నా పిల్లలను స్కూలు­కు తీసుకెళ్లేటప్పుడు∙కొందరు యువ­కులు వేధిస్తున్నారు’ అని ఆమె వాపోయింది. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించి సమాజంలో మర్యాద లేకుండా చేసిన పవన్‌ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని వేడుకుంది. ఆమె నుంచి పూర్తి సమాచారం సేకరించిన న్యాయమూర్తి విచారణను వచ్చే నెల 15కు  వాయిదా వేశారు. ఆ రోజు మిగిలిన సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు.
 

Advertisement
Advertisement