స్మార్ట్‌ఫోన్స్‌ ఆదాయాల్లో యాపిల్‌ టాప్‌ | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్స్‌ ఆదాయాల్లో యాపిల్‌ టాప్‌

Published Tue, Feb 6 2024 4:37 AM

Apple tops Indian smartphone market by revenue in 2023 - Sakshi

న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో గతేడాది (2023) అమెరికన్‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌ తొలిసారిగా ఆదాయాలపరంగా అగ్రస్థానం దక్కించుకుంది. అమ్మకాల పరిమాణంపరంగా శాంసంగ్‌ నంబర్‌వన్‌గా ఉంది. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన నెలవారీ స్మార్ట్‌ఫోన్‌ ట్రాకర్‌ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023లో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు ..దాదాపు అంతక్రితం ఏడాది స్థాయిలోనే 15.2 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయి.

కొరియన్‌ దిగ్గజం శాంసంగ్, చైనా మొబైల్స్‌ తయారీ సంస్థలు వివో, ఒప్పో తమ మార్కెట్‌ వాటాలను పెంచుకోగలిగాయి. భారత్‌పై ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా యాపిల్‌కి కలిసి వస్తోందని కౌంటర్‌పాయింట్‌ తమ నివేదికలో తెలిపింది. స్థూల ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా గతేడాది ప్రథమార్ధం సవాళ్లతో గడిచిందని, డిమాండ్‌ పడిపోయి, నిల్వలు పెరిగిపోయాయని పేర్కొంది.

5జీ అప్‌గ్రేడ్‌లు, పండుగ సీజన్‌ అమ్మకాలు ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉండటం తదితర అంశాల ఊతంతో ద్వితీయార్ధంలో మార్కెట్‌ క్రమంగా కోలుకోవడం మొదలుపెట్టిందని వివరించింది. మొత్తం ఫోన్ల మార్కెట్లో 5జీ స్మార్ట్‌ఫోన్ల వాటా 52 శాతం దాటిందని, వార్షిక ప్రాతిపదికన 66 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. మరోవైపు, 2023 నాలుగో త్రైమాసికంలో దేశీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 25 శాతం వృద్ధి చెందినట్లు కౌంటర్‌పాయింట్‌ తెలిపింది.  

మరిన్ని విశేషాలు..
► స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు ప్రీమియం ఫోన్లపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. 2023లో రూ. 30,000 పైన రేటు ఉన్న ప్రీమియం సెగ్మెంట్‌ ఫోన్ల అమ్మకాలు 64 శాతం పెరిగాయి. సులభతరమైన ఫైనాన్సింగ్‌ స్కీములు కూడా ఇందుకు తోడ్పడ్డాయి. ప్రతి మూడు స్మార్ట్‌ఫోన్లలో ఒకటి ఫైనాన్స్‌ మీదే కొన్నారు.
► ప్రీమియం సెగ్మెంట్‌లో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లకు మరింతగా ఆదరణ పెరగవచ్చు. వాటి అమ్మకాలు 2024లో 10 లక్షలు దాటవచ్చని అంచనా.
► స్మార్ట్‌ఫోన్లలో ఆడియో–వీడియోపరంగా డాల్బీ అటా్మస్, డాల్బీ విజన్‌ వంటి ఫీచర్లు మరింతగా పెరగవచ్చు.

Advertisement
Advertisement