కాంగ్రెస్‌ను నమ్మి గ్రామీణులు మోసపోయారు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను నమ్మి గ్రామీణులు మోసపోయారు

Published Fri, May 3 2024 5:02 AM

KTR in Moosapet and Rahmatnagar road shows

ఆరు గ్యారంటీల పేరుచెప్పి గద్దెనెక్కి వాటిని అమలు చేయట్లేదు 

హైదరాబాద్‌కు కేసీఆర్‌ తెచ్చిన కంపెనీలు రేవంత్‌ అసమర్థత వల్ల బయటకు పోతున్నాయి

జూన్‌ 2న నగరాన్ని యూటీ చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోంది 

మూసాపేట, రహమత్‌నగర్‌ రోడ్‌ షోలలో మాజీ మంత్రి కేటీఆర్‌ 

మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థుల తరఫున ప్రచారం 

మూసాపేట/రహమత్‌నగర్‌: గ్రామాల్లోని ప్రజలు కాంగ్రెస్‌ మాయమాటలు నమ్మి మోసపోయారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు చెప్పారు. ఆరు గ్యారంటీల పేరు చెప్పి గద్దెనెక్కిన రేవంత్‌ సర్కారు ఇంకా ఆ హా మీలను అమలు చేయట్లేదని ఆరోపించారు. లోక్‌సభ ఎ న్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు 10–12 సీట్లు అందిస్తే బీజేపీ, కాంగ్రెస్‌లను కూకటివేళ్లతో పెకిలించి తెలంగాణ రాష్ట్రా  న్ని కేసీఆర్‌ శాసిస్తారని చెప్పారు. 

పార్టీ మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్‌ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్‌ తరఫున గురువారం హైదరాబాద్‌లోని మూసాపేట, రహమత్‌నగర్‌ డివిజన్‌ శ్రీరాంనగర్‌లలో నిర్వహించిన రో డ్‌షోలలో ఆయన పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు నగర పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యేలను గెలిపించినట్లుగానే నగరంలోని లోక్‌సభ స్థానా ల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

కాంగ్రెస్‌ పాలనలో కరెంటు కోత.. నీటి కొరత 
కేసీఆర్‌ ఉన్నప్పుడు హైదరాబాద్‌ సహా తెలంగాణలో ఎక్కడా కరెంటు కోతలు లేవని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రోజుకు 4–5 సార్లు కరెంటు పోతోందన్నారు. మంచినీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి తెచ్చిన కంపెనీలు గుజరాత్, తమిళనాడుకు వెళ్లిపోయాయని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న అవకాశాలను పోగొట్టే అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి అని కేటీఆర్‌ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి డమ్మీ అని, ఆమెను ఎక్కడి నుంచో ఇక్కడకు తీసుకొచ్చారని విమర్శించారు.  

బీజేపీవి మత రాజకీయాలు.. 
ప్రధాని మోదీ తెలంగాణకు బుల్లెట్‌ ట్రైన్‌ తీసుకురాలేదని, మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు, మూసీ సుందరీకరణకు నిధులు ఇవ్వలేదని కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణతోపాటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌కు కూడా మోదీ ఏమి చేయలేదని విమర్శించారు. బీజేపీ అక్కరకు రాని చుట్టమంటూ ఎద్దేవా చేశారు. 

ఆయన కేవలం హిందూ ముస్లింల పేరుతో ఓట్లు దండుకొని మత రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కేసీఆర్‌ పునర్నిర్మించినా ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదని చెప్పారు. దేవుళ్లను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయవచ్చా? అని ప్రశ్నించారు. 

మోదీ, రేవంత్‌లు బడే భాయ్, చోటే భాయ్‌ 
బడే భాయ్‌ మోదీ, చోటా భాయ్‌ రేవంత్‌రెడ్డి మాటలను నమ్మొద్దని కేటీఆర్‌ ప్రజలను హెచ్చరించారు. ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ మాయల మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి.. పేదవారిని ఆదుకొనే ఒక్క పథకమైనా చేశారా అని ప్రశ్నించారు. 

నాలుగున్నర నెలల్లో చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్ప రేవంత్‌ ఏమీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌ హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే రేవంత్‌ నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. జూన్‌ 2న హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని బీజేపీ కుట్రపన్నుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. బీజేపీ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో కేసీఆర్‌ పంపే గులాబీదళం ఉండాలన్నారు. 

అందుకోసం మల్కాజిగిరి ప్రజల తరఫున మాట్లాడే రాగిడి లక్ష్మారెడ్డి, పద్మారావులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయా రోడ్‌ షోలలో కేటీఆర్‌ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, శంబీపూర్‌ రాజు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement