భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో? | Sakshi
Sakshi News home page

భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?

Published Fri, May 3 2024 5:21 AM

This time it is a three way competition in the MP segment

ఎంపీ సెగ్మెంట్‌లో ఈసారి త్రిముఖ పోటీ  

లక్ష ఓట్ల సాధన లక్ష్యంతో బరిలో సీపీఎం 

సాక్షి, యాదాద్రి: ఈసారి భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌లో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, తొలిసారి పాగా వేయాలని బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకసారి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌ మరోసారి గెలుపు కోసం పోరాడుతోంది. సీపీఎం మాత్రం లక్ష ఓట్ల సాధన లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. 

అయితే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్యేరసవత్తర పోరు సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పాటైంది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్, 2019లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్‌ తరఫున చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి క్యామ మల్లే‹Ù, సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్‌ పోటీలో ఉన్నారు.  

బూర నర్సయ్యగౌడ్‌ బీజేపీ
బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలోకి బూర
భువనగిరిలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా గెలిచిన డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా 2022లో బీజేపీలో చేరారు. తొలి విడతలోనే బీజేపీ టికెట్‌ సంపాదించారు. ప్రధాని మోదీ చరిష్మాతోపాటు తనకున్న వ్యక్తిగత పరిచయాలు, తాను ఎంపీగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకొని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. చెప్పుకోదగ్గ ఓట్లు కూడా ఆ ఎన్నికల్లో రాబట్టుకోలేకపోయింది. గౌడ సామాజికవర్గ ఓట్లు అత్యధికంగా ఉండడం, బీసీ నినాదం, బీఆర్‌ఎస్‌ లోని పాత పరిచయాలతో క్రాస్‌ ఓటింగ్, మాదిగ ఓట్లు బీజేపీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.  

క్యామ మల్లేష్‌ బీఆర్‌ఎస్‌
సామాజికవర్గ సమీకరణలో క్యామ మల్లేష్‌
రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన క్యామ మల్లేష్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. క్యామ మల్లేష్‌ది గొల్లకుర్మ సామాజికవర్గం. కేసీఆర్‌ చరిష్మా, బీఆర్‌ఎస్‌ పార్టీని నమ్ముకొని ప్రచారాన్ని సాగిస్తున్నా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక జనగామలో తప్ప, ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే గెలిచారు.

 కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అంశాలను ఎండగడు తూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై అధికంగా ఆధారపడ్డారు. దీనికితోడు బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు కలిసివస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. బీసీ నినాదం కూడా వినిపిస్తున్నారు. గులాబీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం మొక్కుబడిగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది.  

కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌
కోమటిరెడ్డి ఆధ్వర్యంలో చామల 
కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు బాధ్యతలను భువనగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జ్, మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీసుకున్నారు. నియోజకవర్గ కేంద్రాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లతో కోమటిరెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు, అభ్యర్థితో కలిసి ప్రచారం చేశారు. 

కోమటిరెడ్డి సోదరులను గెలిపించిన భువనగిరి ప్రజలు తన సోదరుడులాంటి చామలను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలను కోరుతున్నారు. తన సామాజికవర్గ ఓట్లు, మైనార్టీ ఓట్లపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు ఇస్తోంది.  

సెమీ అర్బన్‌ నియోజకవర్గం 
భువనగిరి లోక్‌సభ స్థానం పరిధి సెమీ అర్బన్‌గా ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, ఆలేరులోని కొంతప్రాంతం హెచ్‌ఎండీఏలో ఉంది. జనగామ, తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ప్రజలు జీవిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి అంతంగా మాత్రంగానే ఉంది. హైదరాబాద్‌కు ఈస్ట్‌కు శివారులో ఉన్నా, ప్రగతి మాత్రం వెనుకబడి ఉంది.  

పోటీలో సీపీఎం  
రాష్ట్రం మొత్తంలో సీపీఎం పోటీ చేస్తున్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం భువనగిరి. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ను అభ్యర్థిగా పోటీలో నిలిపింది. లక్ష ఓట్లు సాధించడమే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. వివిధ వర్గాల కారి్మకుల ఓట్లపై కన్నేసింది.  

ప్రభావితం చేసే అంశాలు  
పెండింగ్‌ రైల్వే, సాగునీటి ప్రాజెక్టులు 
జాతీయ రహదారుల విస్తరణ జాప్యం 
కాళేశ్వరం భూసేకరణలో కోల్పోయిన భూములకు పరిహారం 
చేనేత కార్మికుల, ఐటీ కారిడార్, పారిశ్రామిక కారిడార్‌ల ఏర్పాటు 
టూరిజం, డ్రైపోర్టు, ఎయిమ్స్‌లో పూర్తి స్థాయి వైద్యం  
గౌడ, గొల్లకుర్మ, ఎస్సీ, ఎస్టీ, ముదిరాజ్, పద్మశాలి, మున్నూరుకాపు, రెడ్డి సామాజికవర్గ ఓటర్లు  

2019 లోక్‌సభ ఎన్నికల ప్రధానపార్టీల అభ్యర్థుల ఓట్లు ఇలా... 
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్‌) 5,32,795 (44.37 శాతం) 
బూరనర్సయ్యగౌడ్‌ (టీఆర్‌ఎస్‌) 5,27,576 (43.94 శాతం) 
పీవీ శ్యాంసుందర్‌రావు (బీజేపీ) 65,451 (5.45 శాతం)  

Advertisement
Advertisement