Sakshi News home page

ఐకానిక్‌ భవనాన్ని కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Published Fri, Mar 15 2024 10:42 AM

GoI Approved To Transfer Rights Of AirIndia Building From AIAHL To Maharashtra Govt - Sakshi

ఎయిరిండియాకు చెందిన ముంబయిలోని ప్రతిష్ఠాత్మక ఐకానిక్‌ భవనం యాజమాన్య హక్కులను మహారాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకుంది. ఈ భవనాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,601 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో దక్షిణ ముంబయిలోని నారిమన్‌ పాయింట్‌ వద్ద ఉన్న ఎయిరిండియా భవనం యాజమాన్య హక్కులను కేంద్రం.. మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆస్తుల బదిలీకి తాజాగా ఆమోదం తెలిపింది.

1970ల్లో కేవలం ఈ భవనంలోని ఎలివేటర్‌ను ఎక్కడం కోసమే ప్రజలు క్యూ కట్టేవారట. జేఆర్‌డీ టాటా ఆలోచనలకు తగ్గట్లుగా న్యూయార్క్‌ ఆర్కిటెక్ట్‌ జాన్‌ బర్గీ డిజైన్‌ చేసిన ఈ 23 అంతస్తుల భవనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సొంతం చేసుకుంది. దీన్ని సచివాలయంలోని కొన్ని విభాగాల కోసం ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది. కంపెనీ బకాయిపడిన రూ.298.42 కోట్లను మాఫీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు. 

ఇదీ చదవండి: ‘రాజకీయంగా దాడి చేశారు.. వారు దెబ్బతినడం బాధించింది’

కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎయిరిండియాను టాటాలకు విక్రయించినప్పుడు ఎయిర్‌లైన్స్‌కు చెందిన నాన్-కోర్ ఆస్తుల్ని అందులో చేర్చలేదు. దీంతో సంస్థకు చెందిన భూమి, భవనాలు వంటి రూ.14,718 కోట్ల విలువైన వాటిని ఎయిరిండియా అసెట్స్‌ హోల్డింగ్‌ కంపెనీ(ఏఐఏహెచ్‌ఎల్‌)కు బదిలీ చేసింది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాను టాటా గ్రూపు 2021 అక్టోబరులో రూ.18,000 కోట్లకు బిడ్డింగ్‌లో దక్కించుకుంది.

Advertisement

What’s your opinion

Advertisement