శబరి మూవీ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌పై డైరెక్టర్‌ ఆసక్తికర కామెంట్స్! | Sakshi
Sakshi News home page

Sabari Movie: శబరి మూవీ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌పై డైరెక్టర్‌ ఆసక్తికర కామెంట్స్!

Published Mon, Apr 29 2024 6:21 PM

Director Anil Katz Comments Varalaxmi Sarathkumar Sabari role

లేడీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి  వరలక్ష్మీ శరత్ కుమార్. ఆమె ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం 'శబరి'. ఈ చిత్రాన్ని మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ చిత్రం ద్వారా అనిల్ కాట్జ్  దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కాట్జ్ ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. 

'శబరి' ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది?

నాలుగైదేళ్ల క్రితమే 'శబరి' ఆలోచన వచ్చింది. ప్రాణానికి మించి మనం దేనిని అయినా ప్రేమిస్తే... అది ప్రాణం తీసేంత ద్వేషంగా మారే అవకాశం ఉంది' ఇదీ నేను చెబుదామనుకున్న పాయింట్! మారుతున్న సమాజంలోనూ ప్రేమకు స్వచ్ఛమైన రూపం మాతృత్వంలో మాత్రమే ఉంది. పిల్లల విషయంలో చెడ్డ తల్లి ఉండదు. తల్లి ప్రేమలో నిజాయతీ ఉంటుంది. ఈ నేపథ్యంలో, తల్లి కుమార్తె ప్రేమ నేపథ్యంలో ఆ పాయింట్ చెబితే బాగుంటుందని కథ రాసుకున్నా.

'శబరి' టైటిల్ పెట్టడం వెనుక కారణమేంటి?

రామాయణం తీసుకుంటే శబరికి రాముడు సొంత కొడుకు కాదు.. ఆయన వస్తారని ఎన్నో ఏళ్లు ఎదురు చూసింది. రుచిగా ఉన్న ఫలాలు మాత్రమే ఇవ్వాలని.. ఒకవేళ ఆ ఫలాల వల్ల ప్రమాదం ఉందేమోనని ఎంగిలి చేసి ఇస్తుంది. ఆవిడ ప్రేమలో ఓ నిజాయతీ ఉంది. ఏపీలో శబరి పేరుతో నది ఉంది. కేరళలో శబరిమల పుణ్యక్షేత్రం అందరికీ తెలుసు. సంస్కృతంలో శబరి అంటే 'ఆడ పులి' అని అర్థం. నా ప్రధాన పాత్రలో ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందుకే ఆ టైటిల్ పెట్టాను.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ను ఎంపిక చేయడానికి గల కారణం?

స్త్రీ ప్రధాన పాత్రల్లో చేయగల సత్తా ఉన్న ఆరిస్టులు ఇండియాలో తక్కువ మంది ఉన్నారు. ఆ కొందరిలో 'శబరి' చేయగల, సినిమా లీడ్ రోల్‌లో వేరియేషన్స్ అన్నిటినీ పండించగల ఆర్టిస్ట్ ఎవరున్నారని చూస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించారు. 'పందెం కోడి 2', 'తార తప్పటై', 'విక్రమ్ వేద', 'సర్కార్'లో మంచి పెర్ఫార్మన్స్ చేశారు. ఆవిడ హీరోయిన్‌గా కూడా సినిమాలు చేశారు. కానీ వరలక్ష్మి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కూడా చేశారు. ఆవిడ ఇంటర్వ్యూలు చూశాకే ఆఫ్ స్క్రీన్ క్యారెక్టరైజేషన్ నచ్చింది. దర్శకుడిగా ఆ స్వార్థంతో ఆమెను సంప్రదించా. చెన్నైలో కథ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశారు. పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ చెప్పలేదు. 

గోపీసుందర్ మ్యూజిక్ గురించి!

'ఎంత మంచివాడవురా' చేసినప్పుడు ఆయన పరిచయం ఏర్పడింది. మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆయన ఇతర భాషల్లో చేసే సినిమాల పాటలు కూడా నాకు పంపిస్తారు. మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత మూవీ కంప్లీట్ అయ్యాక రీ రికార్డింగ్ చేశారు. సినిమా బాగుందని మెచ్చుకున్నారు.

అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయిందనే నిజమేనా?

కథ విశాఖ నేపథ్యంలో సాగుతుంది. అంటే కథ రాసేటప్పుడు హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ అనుకున్నా. థ్రిల్లర్ సినిమాల్లో హిల్ స్టేషన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. వరలక్ష్మి మాకు డేట్స్  టైంలో మేం విశాఖ వెళ్లేటప్పటికి అక్కడ వాతావరణం మేం కోరుకున్న విధంగా లేదు. అప్పుడు కొడైకెనాల్ వెళ్లాం. అందువల్ల కొంత బడ్జెట్ ఎక్కువైంది. 'హనుమాన్' వంటి సినిమాలకు బడ్జెట్ ఎక్కువైనా విజయం సాధించిన తర్వాత అందరూ హ్యాపీ. 'శబరి'తో మా సినిమా టీమ్‌, ప్రొడ్యూసర్‌ కూడా హ్యాపీ అవుతారని ఆశిస్తున్నా.

పాన్ ఇండియా రిలీజ్ చేయాలని ముందే అనుకున్నారా?

నేను కథ అనుకున్నప్పుడు తెలుగులో తీయాలని అనుకున్నా. వరలక్ష్మికి తమిళంలో మార్కెట్ ఉంది. తెలుగు, తమిళ భాషల్లో చేస్తే బాగుంటుందని అనుకున్నా. మా నిర్మాత మహేంద్రనాథ్ పాన్ ఇండియా రిలీజ్ చేద్దామన్నారు. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ మొదలైంది. కథలో యూనివర్సల్ అప్పీల్, ఆ పొటెన్షియల్ ఆయన చూశారు. దీంతో ఓకే చెప్పా. 

'శబరి' గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు?

మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నా. మిగతా ప్రపంచాన్ని, మన బాధల్ని మర్చిపోయి చూస్తాం కదా! ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని 'శబరి' తీశా. ఇది థ్రిల్లర్ మాత్రమే కాదు... చాలా ఎమోషన్స్ ఉన్నాయి. కేవలం భయపెట్టాలని ప్రయత్నిస్తే ప్రేక్షకులు థ్రిల్ అవ్వరు. తెరపై పాత్రలతో కనెక్ట్ అవ్వాలి. అది పాత్రలో ప్రేక్షకుడు తనని తాను ఊహించుకోవాలి.'శబరి' మంచి థ్రిల్ ఇస్తుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement