రూ.70వేలకోట్ల అమెజాన్‌ షేర్లు అమ్మనున్న బెజోస్‌.. | Sakshi
Sakshi News home page

రూ.70వేలకోట్ల అమెజాన్‌ షేర్లు అమ్మనున్న బెజోస్‌..

Published Mon, Feb 12 2024 2:08 PM

Jeff Bezos To Sell Rs 70 Thousand Crs Amazon Shares Soon - Sakshi

అమెజాన్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జెఫ్‌ బెజోస్‌  1.2 కోట్ల అమెజాన్‌ షేర్లను విక్రయించారు. వీటి విలువ దాదాపు 2.04 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.17వేలకోట్లు)గా అంచనా వేశారు. ఈ విషయాన్ని ఆయన శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించారు. ఈ మేరకు 7, 8 తేదీల్లోనే 1.19 కోట్ల షేర్లను బెజోస్‌ విక్రయించారు. 10 లక్షల నుంచి 32 లక్షల షేర్ల బ్లాకులుగా వీటిని అమ్మినట్లు తెలిసింది.

ఇంతటితో బెజోస్‌ షేర్ల అమ్మకాలు అయిపోయినట్లు కాదని సమాచారం. మొత్తంగా 8.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.70,000 కోట్ల)కు పైగా విలువైన 5 కోట్ల అమెజాన్‌ షేర్లను విక్రయించాలన్నది బెజోస్‌ ప్రతిపాదనగా తెలిసింది. 2021లో సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత షేర్లను అమ్మడం ఇదే తొలిసారి. 2025 జనవరి నాటికి ఐదు కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు గత ఏడాది నవంబర్‌లోనే వెల్లడించారు.

తాజా 1.2 కోట్ల షేర్లను బుధ, గురువారాల్లో విక్రయించినట్లు బెజోస్‌ వెల్లడించారు. 169.71 - 171.02 డాలర్ల మధ్య వివిధ ధరల వద్ద వీటిని అమ్మినట్లు తెలిపారు. శుక్రవారం అమెజాన్‌ షేరు 174.45 దగ్గర స్థిరపడింది. గత 12 నెలల్లో దీని విలువ 78 శాతం పుంజుకుంది. 2023 ఫిబ్రవరి నాటికి బెజోస్‌కు కంపెనీలో 12.3 శాతం వాటా ఉంది. ప్రణాళికలో భాగంగా ఐదు కోట్ల స్టాక్స్‌ను విక్రయించినా.. ఇంకా ఆయన 11.8 శాతం వాటా కలిగి ఉంటారని అంచనా. 

తన నివాసాన్ని సియాటెల్‌ నుంచి మియామీకి మారుస్తున్నట్లు గత నవంబర్‌లో బెజోస్‌ వెల్లడించారు. షేర్లు, బాండ్ల విక్రయం ద్వారా వచ్చిన లాభాలు 2,50,000 డాలర్లు దాటితే సియాటెల్‌లో ఏడు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా మియామీకి మారడం వల్ల ఐదు కోట్ల షేర్ల విక్రయంపై ఆయనకు 600 మిలియన్‌ డాలర్ల పన్ను ఆదా అవుతుందని అంచనా. పర్యావరణ సమస్యలపై పోరాటానికి 2020లో 10 బిలియన్‌ డాలర్లతో ‘బెజోస్‌ ఎర్త్‌ ఫండ్‌’ను ఆయన ప్రారంభించారు. ఇళ్లులేని కుటుంబాలు, ప్రాథమిక పాఠశాలల కోసం 2018లో రెండు బిలియన్‌ డాలర్ల ‘బెజోస్‌ డే వన్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా జెఫ్ బెజోస్ మాజీ భార్య మకెంజీ స్కాట్ సైతం గతేడాది అమెజాన్‌లో తన 25శాతం షేర్లను (6.53 కోట్ల షేర్లు) విక్రయించారు. అమెజాన్‌లో ఆమె వాటా 1.9 శాతానికి తగ్గింది. జెఫ్ బెజోస్, మెకెంజీ స్కాట్ 25 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం 2019లో విడాకులు ప్రకటించారు.

ఇదీ చదవండి: ‘అవసరమైతే ఉద్యోగం మానేస్తాం.. కానీ..’ ఉద్యోగుల నిర్ణయం

ఆ సమయంలో మెకెంజీ స్కాట్‌కి అమెజాన్‌లో 4శాతం వాటా దక్కగా.. దాని విలువ 36 బిలియన్ డాలర్లు(రూ.2.9లక్షల కోట్లు). దాంతో ఆమె ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో చేరారు. అయితే, 2019 సంవత్సరంలో ఆమె తన సంపదలో సగభాగాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
Advertisement