పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్‌ | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్‌

Published Mon, May 6 2024 7:45 AM

పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్‌

భూపాలపల్లి: ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, పకడ్బందీగా పూర్తిచేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి భవేష్‌మిశ్రా సూచించారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ స్టేడియంలోని సింగరేణి మినీ ఫంక్షన్‌ హల్‌లో జరుగుతున్న ఈవీఎం కమిషనింగ్‌ కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా భవేష్‌మిశ్రా మాట్లాడుతూ.. కమిషనింగ్‌ చేసే ముందు ప్రతీ ఈవీఎం, వీవీ ప్యాట్‌లను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఏ ఒక్క చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా చేపట్టాలని చెప్పారు. బీయూలలో అభ్యర్థుల గుర్తులు స్పష్టంగా కనిపించేలా బ్యాలెట్‌ పేపర్‌ సక్రమంగా అమర్చాలన్నారు. కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌లకు ట్యాగింగ్‌ చేసేటప్పుడు పోలింగ్‌స్టేషన్‌ నంబర్లను జాగ్రత్తగా పరిశీలించి సీల్‌ వేయాలన్నారు. 30 సెక్టార్లుగా విభజించి అత్యంత భద్రత, వీడియోగ్రఫీ మధ్య కమిషనింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్యాలెట్‌ పత్రాల కూర్పు సక్రమంగా చేపట్టి, బ్యాలెట్‌ స్క్రీన్‌ని అడ్రస్‌ ట్యాగ్‌తో సీల్‌ చేయాలన్నారు. బ్యాలెట్‌ యూనిట్‌లో అవసరమయ్యే సంఖ్య వరకు అభ్యర్థుల గుర్తులు తదుపరి నోటాతో సహా అప్‌ లోడ్‌ చేయాలన్నారు. అనంతరం భూపాలపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో జరుగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి వచ్చే ఓటరు సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయడంతో పాటు ధృవీకరణ చేసేందుకు గెజిటెడ్‌ అధికారులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మొత్తం నాలుగు పోలింగ్‌ బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాల వారీగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి అర్జీ పెట్టుకున్న ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 2,245 నమోదు కాగా ప్రారంభం రోజున 423 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కు వినియోగానికి అవకాశం ఉందని ప్రతీరోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటుహక్కు వినియోగానికి అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 8 వరకు

బ్యాలెట్‌ వినియోగానికి అవకాశం

కలెక్టర్‌ భవేష్‌మిశ్రా

Advertisement
Advertisement