గుడివాడలో పేలవంగా పవన్ బహిరంగ సభ
జనం లేక వెలవెలబోయిన వైనం
కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో టీడీపీ అభ్యరి్థ వెనిగండ్ల రాము తీరుపై‡ జనసేన, బీజేపీ నేతల పెదవి విరుపు
గుడివాడరూరల్: వారాహియాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ శనివారం గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయింది. సభకు భారీ ఏర్పాట్లు చేశామని కూటమి నేతలు చెప్పిన మాటలన్నీ ఒట్టివేనని తేలిపోయాయి. ఉదయం 11 గంటలకు పవన్ హాజరవుతారని చెప్పగా 12.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
పవన్ వచ్చే సరికి పట్టుమని మూడు వేల మంది కూడా లేరు. దీంతో కూటమి అభ్యర్థులు, నాయకులపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పవన్ ప్రసంగం మొదలయ్యే సమయానికి కేవలం 2 వేల మంది జనాలు లేకపోవడంలో పవన్ ప్రసంగం చప్పగా సాగింది. సభా ప్రాంగణం వద్ద సరిగా ఏర్పాట్లు కూడా చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ సభ ఫెయిల్ కావడంతో కూటమి నేతల్లో ఓటమి భయం నెలకొంది.
కుమ్ములాటలే కారణమా...?
పవన్ బహిరంగ సభ ఫెయిల్ కావడానికి నియోజకవర్గం టీడీపీలో కుమ్ములాటలే కారణమా అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము ఒంటెద్దు పోకడలతోనే టీడీపీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయని ఆ పార్టీ నాయకులే బాహాటంగా పేర్కొంటున్నారు. తాను జీతం ఇచ్చి నియమించుకున్న వారిని తప్ప జనసేన, బీజేపీ నేతలతో పాటు టీడీపీ సీనియర్ నాయకులను రాము పట్టించుకోవడం లేదని అంటున్నారు.
కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదనేది వాపోతున్నారు. కేవలం తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, బీజేపీ, జనసేన దళిత నేతలకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని చెబుతున్నారు. తాము పార్టీ కోసం కష్టపడుతున్నా పొత్తు ధర్మాన్ని పాటించకుండా తమను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సైతం పిలవకుండా రాము వ్యవహరిస్తున్న తీరుపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారానికి వచ్చిన సమయంలోనూ కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై సొంత పార్టీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు పెదవి విరుస్తున్నారు.
తూతూ మంత్రంగా సాగిన పవన్ ప్రసంగం
బహిరంగ సభలో జనం లేకపోవడంతో పవన్ ప్రసంగం తూతూ మంత్రంగా సాగింది. ఎప్పుడు గుడివాడ వచ్చిన ఒకే విధంగా పవన్ మాట్లాడటం, స్థానిక నాయకులు ఇచ్చే పేపర్లు చదివి వెళ్లిపోవడం మినహా గుడివాడకు తాము ఏమి చేస్తామనే అంశం చెప్పకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ పేకాట, మట్టికి సంబంధించి మాత్రమే పవన్‌తో గుడివాడ నాయకులు మాట్లాడించడం పట్ల ప్రజలు పట్టించుకోవడం మానేశారు.
చంద్రబాబు, టీడీపీ అగ్రనాయకులు వస్తే మాత్రం మంచినీళ్ల ప్రాయంగా రాము డబ్బు ఖర్చు పెట్టే వాడని, పవన్ వస్తే కనీస ఏర్పాట్లు చేయడం అటు ఉంచితే ప్రజలను సైతం తీసుకురావడంలో విఫలమయ్యాడని విమర్శిస్తున్నారు. మరోసారి ఓటమి ఖాయమనే భావనలోకి కూటమి నేతలు వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఎదుర్కొనే సత్తా టీడీపీకి లేదని, మరోసారి ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ప్రజలు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment