దిగిపోనున్న బోయింగ్ సీఈవోకి రూ.366 కోట్లు! | Sakshi
Sakshi News home page

దిగిపోనున్న బోయింగ్ సీఈవోకి రూ.366 కోట్లు!

Published Sun, Apr 7 2024 3:45 PM

outgoing boeing ceo may get rs 366 crore upon his exit - Sakshi

బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ భారీ మొత్తంలో రిటైర్మెంట్‌ చెల్లింపులు పొందనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పదవి నుంచి వైదొలగనున్న ఆయన రిటైర్మెంట్‌ చెల్లింపుల కింద 44 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.366 కోట్లు) అందుకునే అవకాశం ఉందని రాయిటర్స్‌ నివేదించింది.

డేవిడ్ కాల్హౌన్ 2023 సంవత్సరానికి 33 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.274 కోట్లు)  వేతన పరిహారాన్ని అందుకున్నారు. దాదాపుగా అదంతా స్టాక్ అవార్డ్స్‌లో ఉంది. అయితే జనవరిలో గాల్లో ఉన్న బోయింగ్‌ విమానం డోర్‌ ప్యానెల్‌ ఊడిపడిన ఘటన తర్వాత బోయింగ్ షేర్ ధర తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరం ఆయన స్టాక్ చెల్లింపు దాదాపు నాలుగింట ఒక వంతు తగ్గుతుంది. 

ఈ ఘటన తర్వాత 2023 సంవత్సరానికి సీఈవో డేవిడ్‌ కాల్హౌన్‌ బోనస్‌ను (దాదాపు రూ.24 కోట్లు) తిరస్కరించినట్లు కంపెనీ తెలిపింది. ఘటనకు సంబంధించి బోయింగ్ దాని తయారీ నాణ్యత, భద్రతపై పలు విచారణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరిలో తాను పదవి నుంచి వైదొలుగుతానని కాల్హౌన్ ఈ నెలలో ప్రకటించారు.

కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కాల్హౌన్ గత సంవత్సరం 1.4 మిలియన్‌ డాలర్ల జీతం, 30.2 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులను పొందినట్లు పేర్కొంది. ఇతర చెల్లింపులతో సహా కాల్హౌన్‌ 2023 పరిహారం మొత్తం 32.8 మిలియన్‌ డాలర్లు. కాగా 2022లో ఆయన 22.6 మిలియన్‌ డాలర్ల పరిహారం అందుకున్నారు.

Advertisement
Advertisement