సాక్షి, హైదరాబాద్: దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. అధికారంలోకి రాగానే పేదల లిస్ట్ అంతా తయారు చేసి, ప్రతి పేద ఇంటిలో ఒక మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని తెలిపారు. దేశంలో సంపదకు కొదవలేదని అన్నారు. ఇన్ని రోజులు ప్రజల డబ్బులను మోదీ పెట్టుబడిదారులకు పంచారు. తాము పేదలకు పంచుతామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో గురువారం కాంగ్రెస్ ప్రచార సభ నిర్వహించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు. విద్యార్ధులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పన చేస్తామని పేర్కొన్నారు. తప్పుడు నిర్ణయాలతో మోదీ నిరుద్యోగం పెంచారు.తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పాలన కొనసాగిస్తుందని, తెలంగాణ లాంటి ఈ పాలన దేశవ్యాప్తంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.
‘బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారు. భారత రాజ్యాంగం కేవలం పుస్తకం కాదు. అది పేద ప్రజల చప్పుడు. రిజర్వేషన్లు వచ్చింది మన రాజ్యాంగం వల్లే. ప్రజలకు అధికారం ఇచ్చింది రాజ్యాంగం. ఈ రాజ్యాంగం కోసం అంబేద్కర్, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు తమ చెమటను, రక్తాన్ని దారపోశారు. రాహుల్, రేవంత్ లాంటి వాళ్ళం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. అదానీ, అంబానీ లాంటి 22 మంది కోసం మోదీ రాజ్యాంగాన్ని నడిపారు. ప్రజలకు చెందిన లక్షల కోట్లను 22 మంది పెట్టుబడి దారులకు మోదీ పంచారు’ అని ధ్వజమెత్తారు.
మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. విశ్వనగరంలో బీజేపీ విషం చిమ్ముతోందని మండిపడ్డారు. 15 సెకన్ల సమయం ఇస్తే ముస్లింలను తుదిముట్టిస్తామని బీజేపీ ఎంపీ అంటోందని విమర్శించారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి మనం చేయలేదా? మనకా వీళ్ళు హిందుత్వం నేర్పేదని ప్రశ్నించారు. అక్షింతలు పంపి ఓట్ల బిచ్చం ఎత్తుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
‘ఈ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య. రాజ్యాంగం ప్రమాదంలో పడింది. మేం ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నారు. రిజర్వేషన్లపై దాడి చేయాలని మోదీ, అమిత్ షా కంకణం కట్టుకున్నారు. రాజ్యాంగం సంక్షోభంలో పడే సమయంలో ఇందిరాగాంధీ మెదక్ నుండి పోటీ చేసింది. ఇందిరా మనమడు, సోనియా కొడుకు రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపాడడానికి తెలంగాణ గడ్డపైకి వచ్చి యుద్ధం ప్రకటించారు.
తెలంగాణ బిడ్డలు రాహుల్ గాంధీ వైపు నిలబడాలి. రిజర్వేషన్లు కాపాడే పోరాటంలో మనమంతా రాహుల్ తో కలిసి నడవాలి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మత సామరస్యం పెంపొందించాం కాబట్టే వేల కోట్ల పెట్టుబడులు హైదారాబాద్‌కు వచ్చాయి. బీజేపీ మత ఉచ్చులో పడకండి. 15 సెకన్లలో ముస్లింలను తుదముట్టిస్తామని చెప్పిన బీజేపీ ఎంపీ పై అమిత్ షా, మోదీ స్టాండ్ ఏంటో చెప్పాలి. మోదీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాడు’
Comments
Please login to add a commentAdd a comment