సంబరపడిపోతున్న ప్రత్యర్థులకు షాక్‌.. సరికొత్త ప్లాన్‌లో పేటీఎం! | Sakshi
Sakshi News home page

సంబరపడిపోతున్న ప్రత్యర్థులకు షాక్‌.. సరికొత్త ప్లాన్‌లో పేటీఎం!

Published Sun, Feb 11 2024 7:08 PM

Paytm set to operate as third party app for UPI - Sakshi

సంక్షోభంలో చిక్కుకున్న ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం మూతపడుతుందని, ఇక తమకు తిరుగులేదని సంబరపడిపోతున్న ప్రత్యర్థి కంపెనీలకు పేటీఎం షాక్‌ ఇవ్వబోతోంది. తమ కస్టమర్లను కాపాడుకునేందుకు ఈ ఫిన్‌టెక్‌ సరికొత్త ప్లాన్‌ చేస్తోంది. 

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సంక్షోభంలో చిక్కుకున్న పేటీఎం (Paytm) మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తమ కస్టమర్లకు యూపీఐ ( యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ - UPI ) సేవలు అందుబాటులో ఉండేలా థర్డ్-పార్టీ పేమెంట్ యాప్ (TPAP) మార్గంపై దృష్టి సారిస్తోంది.

ఇదీ చదవండి: ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు

"పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చెల్లింపు సేవలను నిలిపివేస్తుంది కాబట్టి, ఇతర బ్యాంకుల ద్వారా యూపీఐని ఏకీకృతం చేస్తూ ముందుకు సాగే థర్డ్-పార్టీ యాప్‌గా మారుతుంది" అని పేటీఎంలో పరిణామాల గురించి తెలిసిన ఒక వ్యక్తి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. దేశంలో యూపీఐ వ్యవస్థను నడుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మారనున్న వీపీఏ
ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల కోసం పేటీఎం యూజర్లు @paytmతో ముగిసే వర్చువల్ పేమెంట్‌ అడ్రస్‌ (VPA) కలిగి ఉన్నారు. అయితే, మార్చి 1 తర్వాత ఈ వీపీఏలు వేరే బ్యాంక్ హ్యాండిల్‌కి మారుతున్నాయి.  పేటీఎం యూపీఐ సర్వీస్‌ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) కిందకు వస్తుంది.  ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ల నుంచి డబ్బు తీసుకోకుండా ఆర్బీఐ జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని నిషేధించింది.  ఈ నేపథ్యంలో పేటీఎం తమ యూపీఐ కస్టమర్లకు కొత్త వీపీఏల కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులతో భాగస్వామ్యం చేసుకోనుందని తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యస్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి.

 

అమెజాన్‌ పే, గూగుల్‌ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe)లతో సహా ఇప్పటికే 22 థర్డ్-పార్టీ పేమెంట్ యాప్‌లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు థర్డ్-పార్టీ రూట్ ద్వారా ఇలాంటి ఫిన్‌టెక్‌లకు సహకారం అందిస్తున్నాయి.  సాధారణంగా వీపీఏను బ్యాంక్, ఫిన్‌టెక్ రెండింటి బ్రాండ్ పేర్లను కలిపి రూపొందిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement