అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది? | Sakshi
Sakshi News home page

అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?

Published Mon, May 6 2024 2:05 AM

అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?

సాక్షి నెట్‌వర్క్‌: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు వ్యవహార శైలిపై ఆ పార్టీ నేతలే లోలోన మదనపడుతున్నారు. గత ఐదేళ్లు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం ఇటీవల ప్రతిపక్ష టీడీపీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఆయన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధినాయకుడు ప్రకటించిన సమయంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఆయన నాయకత్వంపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నాయకులు ఎమ్మెల్యే తనయుడు సుమన్‌కుమార్‌ వ్యవహార శైలిపై అనేక అవమానాలు, భంగపాటుకు గురయ్యారు. ఆయనకు ముడుపులు ముట్టజెప్పితే గానీ పనులు జరగవని ముద్ర వేసుకున్నాడు. కనీసం ఏదైనా పని మీద గానీ, ఉద్యోగుల పోస్టింగుల విషయంలో తండ్రిని కలవాలంటే ముందుగా యువ నాయకుడికి ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేని పక్షంలో ఎమ్మెల్యేను కలవలేరు. పైగా కలిసిన సమయంలో యువ నాయకుడి కంటపడితే ఆ పని మీద వచ్చిన నేతకు గానీ, అధికారికి గానీ పిడిగుద్దులు తప్పవు. ఇంతటి ఘనకార్యాలు, అనుభ వాలు అధికార పార్టీ నేతల నుంచి ఆ నోటా ఈ నోటా విన్నా ప్రతిపక్ష టీడీపీ నేతలు ఇప్పుడు భంగపడుతున్నారు.

ముడుపులు ముట్టజెప్పేవారికే ఎమ్మెల్యే ఇంటి అనుగ్రహం

ఎమ్మెల్యేగా గెలుపొందితే ఆ ఐదేళ్లు నియోజకవర్గ ప్రజలు, పార్టీ నేతలు, అధికారులు తమతమ సమస్యలపై ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం పరిపాటే. అయితే ఈ విషయంలో సత్యవేడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం తీరు అందుకు విభిన్నం. కేవలం ముడుపులు ముట్టజెప్పేవారికి మాత్రమే ఎమ్మెల్యే ఇంటి గడప తొక్కేందుకు అర్హులు. సమస్యలపై వెళ్లే సామాన్య జనం ఎమ్మెల్యే ఇంటి దరిదాపుల్లో కనిపిస్తే ఎమ్మెల్యే తనయుడైన యువ నాయకుడికి చిరాకు. వారిని దురుసుగా మాట్లాడడం, అవసరమైతే చేయి చేసుకోవడానికి వెనుకాడడు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన పలువురు నాయకులు, సామాన్య ప్రజలు యువ నాయకుడి నుంచి ఇలాంటి చేదు అనుభవాలను అనేక సందర్భాల్లో చవిచూసినవారే. బహుశా రాష్ట్రంలోనే నియోజకవర్గ ప్రజలను ఇంటికి రానివ్వని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆ ఘనత ఆదిమూలంకే దక్కుతుంది.

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడి శైలిపై మదనపడుతున్న నేతలు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement