ప్రకటించిన బరువు కంటే తక్కువ బరువున్న బిస్కెట్ ప్యాకెట్లను విక్రయించినందుకు ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ బ్రిటానియా సంస్థకు భారీ జరిమానా విధించిన సంఘటనలో కేరళలో జరిగింది. రూ.60,000 నష్టపరిహారం చెల్లించాలని కేరళలోని త్రిస్సూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బ్రిటానియా ఇండస్ట్రీస్, స్థానిక బేకరీని ఆదేశించింది.
వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బేకరీ నుంచి 300 గ్రాముల బరువున్న "బ్రిటానియా న్యూట్రి ఛాయిస్ థిన్ యారో రూట్ బిస్కెట్స్" రెండు ప్యాకెట్లను వినియోగదారుడు కొనుగోలు చేశాడు. అయితే బిస్కెట్ పాకెట్ల బరువుపై అనుమానం వచ్చిన వినియోగదారుడు వాటిని తూకం వేయగా ప్యాకెట్లు వరుసగా 268 గ్రాములు, 248 గ్రాములు ఉన్నాయి.
ప్యాకెట్ ప్రామాణిక బరువు కంటే చాలా తక్కువ ఉండటంతో వినియోగదారుడు త్రిస్సూర్ లోని లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్‌కు ఫిర్యాదు చేశాడు. వాటిని పరిశీలించిన అధికారులు సైతం బిస్కెట్ పాకెట్ల బరువు తక్కువ ఉన్నట్లు నిర్ధారించారు.
వినియోగదారుల రక్షణ చట్టం, 2009 లీగల్ మెట్రాలజీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ దోపిడీ, అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుంచి విముక్తి పొందే వినియోగదారుడి హక్కును బ్రిటానియా కంపెనీ, స్థానిక బేకరీ ఉల్లంఘించాయని కమిషన్ గుర్తించింది. దీంతో ఫిర్యాదుదారుడికి నష్ట పరిహారం కింద రూ.50 వేలు, అతను భరించిన లిటిగేషన్ ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment