చండీగఢ్: జమ్ము-కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో చోటు చేసుకున్న ఉగ్రదాడి.. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ చేస్తున్న స్టంట్ అని పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జలంధర్‌లో నిర్వహించన ఎన్నికల ప్రచారంలో చన్నీ బీజేపీపై ఘాటుగా విమర్శలు చేశారు.
‘‘ఎన్నికల ముందు ఇవన్నీ బీజేపీ చేస్తున్న స్టంట్లు తప్ప ఉగ్రదాడులు కాదు. వాటిల్లో అసలు నిజమే లేదు. బీజేపీ ప్రజలు, శవాలతో ఆటలాడుతోంది. ఈ దాడులు నిజంగా జరిగినవి కావు. కేవలం బీజేపీకి ప్రయాజనం చేసేవి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. గతంలో లాగా బీజేపీ ఇలాంటి చిల్లర స్టంట్లు చేస్తుంది’’ అని చన్నీ దుయ్యబట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే.
అయితే చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర మంత్రి స్పందించారు. ‘‘చన్నీ ఉగ్రదాడిపై సైతం చాలా దిగజారిన వ్యాఖ్యలు చేశారు. అది ఆయన మనస్తత్వానికి నిదర్శనం’’ అని మండిపడ్డారు. శనివారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనంపై జరిగిన ఉగ్రదాడిలో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విక్కీ పహాడే సైనికుడు మరణించగా.. నాలుగురు సైనికులు గాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న జరగనున్న అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పూంఛ్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment