హిమాలయా యోగి చెప్పారు.. చిత్ర చేశారు.. | Sakshi
Sakshi News home page

హిమాలయా యోగి చెప్పారు.. చిత్ర చేశారు..

Published Mon, Feb 14 2022 6:33 AM

SEBI fines NSE, Chitra Ramkrishna, Ravi Narain and others - Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజీ (ఎన్‌ఎస్‌ఈ) సలహాదారుగా ఆనంద్‌ సుబ్రమణియన్‌ వివాదాస్పద నియామకం కేసులో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణకు రూ. 3 కోట్లు, ఎన్‌ఎస్‌ఈకి .. సుబ్రమణియన్‌కు.. మరో మాజీ ఎండీ, సీఈవో రవి నారాయణ్‌కు తలో రూ. 2కోట్లు, మాజీ చీఫ్‌ రెగ్యులేటరీ ఆఫీసర్‌ వీఆర్‌ నరసింహన్‌కు రూ. 6 లక్షల జరిమానా విధించింది. అంతే కాకుండా రామకృష్ణ, సుబ్రమణియన్‌ .. మూడేళ్ల పాటు మార్కెట్‌ ఇన్‌ఫ్రా సంస్థ లేదా సెబీ దగ్గర నమోదైన ఇతర మధ్యవర్తిత్వ సంస్థతో కలిసి పనిచేయకుండా నిషేధం విధించింది. నారాయణ్‌ విషయంలో ఇది రెండేళ్లుగా ఉంది. అటు కొత్త ఉత్పత్తులేమీ ప్రవేశపెట్టకుండా ఎన్‌ఎస్‌ఈపై సెబీ ఆరు నెలలు నిషేధం విధించింది.  

కుట్ర కోణం..
ఈ మొత్తం వ్యవహారంలో చిత్రా రామకృష్ణ నిర్ణయాలను హిమాలయాల్లోని ఒక యోగి ప్రభావితం చేశారని సెబీ వ్యాఖ్యానించింది. ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన గోప్యనీయమైన సమాచారం (ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, ఆర్థిక ఫలితాలు మొదలైనవి) అన్నింటినీ యోగికి ఆమె చేరవేసేవారని, ఆఖరుకు ఉద్యోగుల పనితీరు మదింపు విషయంలో కూడా ఆయన్ను సంప్రదించేవారని.. సెబీ 190 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. యోగి సూచనల మేరకే ఆనంద్‌ను నియమించారని, ఎండీ.. సీఈవో స్థాయి అధికారాలన్నీ కూడా కట్టబెట్టారని, అడ్డగోలుగా జీతభత్యాలు పెంచారని తెలిపింది. ‘ముగ్గురి మధ్య జరిగిన ఈమెయిల్‌ సంప్రదింపులను చూస్తే గుర్తు తెలియని వ్యక్తితో (యోగి) చిత్ర, ఆనంద్‌ కుమ్మక్కై చేసిన కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఆనంద్‌కు చిత్ర జీతభత్యాలు పెంచేవారు, అందులో నుంచి కొంత భాగాన్ని సదరు గుర్తు తెలియని వ్యక్తికి ఆనంద్‌ చెల్లించేవారు‘ అని వ్యాఖ్యానించింది. ఈ అవకతవకలన్నీ తెలిసినా, ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ రవి నారాయణ్‌ సహ ఇతరత్రా అధికారులెవరూ గోప్యనీయ సమాచారం పేరిట ఆ వివరాలేవి రికార్డుల్లో పొందుపర్చలేదని సెబీ ఆక్షేపించింది.

వివరాల్లోకి వెడితే..
చిత్రా రామకృష్ణ 2013 ఏప్రిల్‌ నుంచి 2016 డిసెంబర్‌ వరకు ఎన్‌ఎస్‌ఈ సీఈవో, ఎండీగా పని చేశారు. ఆ సమయంలోనే 2013లో ఆనంద్‌ సుబ్రమణియన్‌ రూ.1.68 కోట్ల వార్షిక వేతనంతో ఎన్‌ఎస్‌ఈలో చీఫ్‌ స్ట్రాటెజిక్‌ అడ్వైజరుగా నియమితులయ్యారు. అప్పుడు ఆయన బామర్‌ అండ్‌ లారీ అనే సంస్థలో రూ. 15 లక్షల వార్షిక వేతనం తీసుకునే మధ్య స్థాయి మేనేజరుగా ఉన్నారు. పైగా క్యాపిటల్‌ మార్కెట్లలో ఎటువంటి అనుభవం లేదు. అయినా ఆయన్ను పిలిచి మరీ ఎన్‌ఎస్‌ఈలో కీలక హోదా కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆయన వేతనం విడతల వారీగా 2016 నాటికి రూ. 4.21 కోట్లకు పెరిగింది. అప్పటికి ఆయన గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, ఎండీకి సలహాదారుగా కూడా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఆయన్ను ఎప్పటికప్పుడు అత్యుత్తమ పనితీరు కనపర్చిన ఉద్యోగిగా ప్రచారం చేసినా, ఎక్కడా ఆయన పనితీరు మదింపు చేసిన ఆధారాలేమీ లేవని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement