ప్రియుడితో కలసి అక్కను చంపి.. | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలసి అక్కను చంపి..

Published Sun, Sep 3 2023 4:48 AM

Software engineer Deepti murder case twist - Sakshi

కోరుట్ల/జగిత్యాల క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బంక దీప్తి (24) హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లెలు చందన ప్రేమ పెళ్లిని దీప్తి వ్యతిరేకించడంతోనే హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీప్తి హత్య కేసులో సూత్రధా రి చందన (22), ఆమె ప్రియుడు ఉమర్‌ షేక్‌ సుల్తాన్‌ (25), అతడి తల్లి సయ్యద్‌ ఆలియా (47), చెల్లెలు ఫాతిమా (22), ఉమర్‌ మిత్రుడు హఫీజ్‌ (25)ను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ భాస్కర్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇద్దరూ బీటెక్‌ చదివారు..
కోరుట్లకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు దీప్తి, చందన, కుమారుడు సాయి ఉన్నారు. పాతికేళ్ల క్రితం శ్రీనివాస్‌రెడ్డి ఉపా«ధి కోసం నెల్లూరు నుంచి కోరుట్లకు వలస వచ్చారు. ఇటుక బట్టీ వ్యాపారం చేస్తున్నారు. దీప్తిని బీటెక్‌ చదివించగా ఆమె పుణేకు చెందిన ఓ కంపెనీలో వర్క్‌ఫ్రం హోమ్‌ పద్ధతిన పనిచేస్తోంది. చందన 2019లో హైదరాబాద్‌ మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరి ఇటీవల బీటెక్‌ పూర్తి చేసింది.

తన సీనియర్, హైదరాబాద్‌కు చెందిన ఉమర్‌ షేక్‌ సుల్తాన్‌ ఒక ఏడాది డిటెయిన్‌ కావడంతో చందనకు క్లాస్‌మేట్‌ అయ్యాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. చందన ఇంట్లో ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఇద్దరు కూతుళ్ల వివాహం చేసేందుకు తండ్రి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న మధ్యాహ్నం దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం... నగదు, బంగారంతో చందన పరారు కావడం కలకలం రేపింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

పెళ్లికి అభ్యంతరం చెప్పినందుకే..
చందన ప్రేమ వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు మతాంతర వివాహానికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని చందన తన ప్రియుడు ఉమర్‌ షేక్‌ దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా పెళ్లి చేసుకుందామని చెప్పింది. కానీ తనకు జాబ్‌ లేదని, డబ్బు లేదని, బతుకడం ఎలా అని ఉమర్‌ షేక్‌ బదులిచ్చాడు. దీంతో తన ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తెస్తానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పిన చందన.. తన అమ్మానాన్న ఇంట్లో లేనిసమయంలో కోరుట్లకు రావాలని ప్రియుడికి సూచించింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లగా చందన తన ప్లాన్‌ అమలు చేసింది.

సూత్రధారి చందన..
తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో సోమవారం ఉదయం 11 గంటలకు ఉమర్‌ షేక్‌ కారులో కోరుట్లకు చేరుకున్నాడు. సాయంత్రం మద్యం తాగుదామని చందన తన అక్కతో చెప్పింది. ప్రియుడితో వొడ్కా, బ్రీజర్‌ తెప్పించింది. మద్యం ఇచ్చి వెళ్లిన ఉమర్‌ షేక్‌ స్థానికంగానే ఉండిపోయాడు. రాత్రి చందన తన అక్క దీప్తికి వొడ్కా తాగించి, తాను బ్రీజర్‌ తాగింది. మత్తులో అక్క నిద్రపోయిందని నిర్ధారించుకున్న చందన.. రాత్రి 2 గంటల సమయంలో షేక్‌ ఉమర్‌కు వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇచ్చింది.

ఉమర్‌ షేక్‌ వచ్చాక నగదు, బంగారం బ్యాగుల్లో సర్దుతున్న క్రమంలో దీప్తికి మెలకువ వచ్చి.. ‘ఏం చేస్తున్నారని’ చందనను నిలదీసింది. దీంతో చందన, ఆమె ప్రియుడు కలిసి దీప్తిని చున్నీతో కట్టేసి నోరు, ముక్కుకు ప్లాస్టర్‌ వేసి చంపి సోఫాలో పడేశారు. అనుమానం రాకుండా ఆ తర్వాత తొలగించారు. దీప్తి అతిగా మద్యం తాగి నిద్రలో చనిపోయినట్లు నమ్మించడం కోసం సినీఫక్కీలో సీన్‌ క్రియేట్‌ చేశారు. తర్వాత ఇద్దరూ కారులో హైదరాబాద్‌ పరారయ్యారు.

వాయిస్‌ మెసేజ్‌తో దారిమళ్లింపు..
అక్కను చంపాక పరారైన చందన.. మర్నాడు హైదరాబా ద్‌లోని తన ప్రియుడు ఉమర్‌ షేక్‌ కలసి అతని తల్లి అలి యా, చెల్లి ఫాతిమా వద్దకు వెళ్లింది. వారంతా కలసి నగదు, డబ్బుతో నాగ్‌పూర్‌ వెళ్లాలనుకున్నారు. ఇంతలో చందన బుధవారం తన తమ్ముడు సాయికి ఫోన్‌లో వాయిస్‌ మెసేజ్‌ పంపించింది. అక్కను తాను చంపలేదని.. బాయ్‌ఫ్రెండ్‌తో రాత్రివేళ ఇంటికి రావాలని అక్క చెప్పిందని, తాను వద్దన్నా నని హత్య కేసును దారిమళ్లించే ప్రయత్నం చేసింది.

నాగ్‌పూర్‌ వెళ్తుండగా..
చందన, ఉమర్‌షేక్‌ సెల్‌ఫోన్ల డేటా ఆధారంగా వారు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో అక్కడకు వెళ్లారు. అయితే కారులో బురఖా వేసుకొని తప్పించుకొని తిరుగుతున్న చందనతోపాటు ప్రియుడు ఉమర్‌ షేక్, అతడి తల్లి అలియా, చెల్లి ఫాతిమా, బంధువు హఫీజ్‌ను నాగ్‌పూర్‌ వైపు పరారవుతుండగా శనివారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌–బాల్కొండ మార్గంలో అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి రూ. 1.20 లక్షల నగదు, సుమారు రూ.80 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మెట్‌పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు కిరణ్, చిరంజీవిని ఎస్పీ అభినందించారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement