మానవతకు 200 రోజుల మచ్చ | Sakshi
Sakshi News home page

మానవతకు 200 రోజుల మచ్చ

Published Thu, Apr 25 2024 7:03 PM

Sakshi Editorial On Palestine, Israel War

ఒకటీ, రెండూ కాదు... ఆరు నెలలు దాటింది. మంగళవారంతో ఏకంగా రెండు వందల రోజులు గడిచిపోయాయి. అయినా, పాలెస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడులు ఆగడం లేదు. సంక్షోభానికి పరిష్కా రమూ కనిపించడం లేదు. సామూహిక సమాధులు, కూలిన ఆస్పత్రులు, శిథిలాల కుప్పగా మారిన భవనాలు, ప్రాణాలు పోయిన వేలాది జనం, ప్రాథమిక వసతులు పూర్తి విధ్వంసంతో పాలెస్తీనా బావురుమంటోంది.

తీవ్రవాద హమాస్‌ బృందం తమపై ఆకస్మికంగా దాడి చేసి, 250 మందిని బందీలుగా చేసుకొని, 1200 మంది ప్రాణాలు తీసినందుకు బదులుగా గత అక్టోబర్‌ 7న సైనిక చర్యకు దిగిన ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు 85 శాతం మంది ఇళ్ళు వదిలి పారిపోయారు. హమాస్‌ ఏరివేతకని చెబుతూ మొదలుపెట్టిన ఈ పాశవిక, ప్రతీకార దాడిలో ఇప్పటికి 14 వేల పైచిలుకు పసిపిల్లలతో సహా 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని లెక్క. నిజానికి, ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనని సహాయక సంస్థల అంచనా. 

గాజా భూఖండపు ఉత్తర ప్రాంతంపై ఇటీవల ఎన్నడూ లేనంతగా శతఘ్నుల వర్షం కురిపిస్తూ, అక్కడ నుంచి జనాల్ని ఖాళీ చేయమంటున్న ఇజ్రాయెల్‌ దక్షిణ ప్రాంత ప్రధాన నగరమైన రాఫాపై దాడికి సర్వసన్నద్ధమవుతుండడం తాజా విషాద పరిణామం. పశ్చిమాసియాలోని ఈ సంక్షోభం అంతకంతకూ పెద్దదవుతూ వచ్చింది. ఇరాన్‌ సైతం ఇటీవల ఇజ్రాయెల్‌తో ఢీ అనడం పర్యవసానాలపై ప్రపంచం భయపడాల్సిన పరిస్థితి తెచ్చింది. పాలెస్తీనా శరణార్థులకు ఉద్దేశించిన ఐరాస సహాయ సంస్థ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) ఉన్నా దానికిప్పుడు నిధులు లేని దుఃస్థితి.

ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన దాడికి ఆ సంస్థ సిబ్బంది కొందరు సహకరించారని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. దాంతో ఆ సంస్థకు సహాయం అందిస్తున్న 16 దాతృత్వ దేశాలు నిధులు నిలిపివేశాయి. పర్యవసానంగా 45 కోట్ల డాలర్ల మేర నిధుల లోటు ఏర్పడి, వేలాది పాలెస్తీనియన్లు ఈ యుద్ధకాలంలో ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్‌వి నిరాధార ఆరోపణలని స్వతంత్ర పరిశీలనలో ఈ వారమే తేలింది. అమెరికా సహా ఇతర దేశాలు మానవతా అవసరంగా గుర్తించి, నైతిక బాధ్యతతో యూఎన్‌ ఆర్‌డబ్ల్యూఏకు ఆర్థిక సాయం పునరుద్ధరించాలని అరబ్‌ లీగ్‌ తాజాగా డిమాండ్‌ చేస్తున్నది అందుకే. 

ఇజ్రాయెల్‌ భీకర దాడుల అనంతరం గాజాలోని ప్రధాన ఆస్పత్రుల వద్ద 300కు పైగా మృతదేహాలతో బయటపడ్డ సామూహిక భారీ సమాధుల దృశ్యాలు సహజంగానే అంతర్జాతీయ ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. ఇజ్రాయెలీ సైనికుల దాడుల్లో అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగిందడానికి సమాధుల్లో కట్టేసిన చేతులతో, వివస్త్రంగా కనిపిస్తున్న శవాలే ప్రత్యక్ష సాక్ష్యం. అనుమానాలకు తావిస్తున్న ఈ సమాధులపై పారదర్శకంగా, స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐరాస ఇప్పటికే డిమాండ్‌ చేసింది.

యూరోపియన్‌ యూనియన్‌ సైతం బుధవారం అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఆగని ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో బాధిత పక్షం వైపు అంతర్జాతీయంగానూ క్రమంగా మొగ్గు కనబడుతోంది. పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడమే ప్రస్తుత సమస్యకు సత్వర పరిష్కారమని భావిస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. గాజా సమస్య అంతకంతకూ మానవతా సంక్షోభంగా పరిణమిస్తుండడంతో తాజాగా జమైకా ప్రభుత్వం పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించడం విశేషం. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనమనే ఐరాస నియమావళి పట్ల నిబద్ధతే ఈ నిర్ణయానికి ప్రేరణ అని జమైకా పేర్కొంది.  

ప్రతి 10 నిమిషాలకూ ఓ పసివాడు చనిపోవడమో, గాయపడడమో జరుగుతున్న పాలెస్తీనాలో, ఇప్పటికి కనీసం 75 వేల టన్నుల పేలుడు పదార్థాల తాకిడికి గురై 62 శాతం ఇళ్ళు ధ్వంసమైన భూభాగంలో, ఆహార కరవుతో 11 లక్షల మంది అన్నమో రామచంద్రా అని అలమటిస్తూ రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్న ప్రాంతంలో... సత్వరమే సంక్షోభాన్ని పరిష్కరించి, శాంతి స్థాపన జరపకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఒకప్పటి కీలకపాత్రధారి ఐరాస ప్రస్తుతం మాటలే తప్ప చేతలు లేక చేష్టలుడిగి చూస్తోంది.

కాల్పుల విరమణకై ఈ ఆరునెలల్లో ఐరాస 4సార్లు తీర్మా నాలు చేసినా, అవన్నీ అగ్రరాజ్యాలు మోకాలడ్డడంతో వీగిపోవడం దురదృష్టం. ఐరాసలో అండగా నిలవడమే కాక, ఇజ్రాయెల్‌కు ఆయుధాలిస్తున్న అమెరికా ఆ దేశానికి ఇటీవలే 2600 కోట్ల డాలర్ల సాయం మంజూరు చేసి, శరణార్థులకేమో మొండిచేయి చూపడం పెద్దన్న ద్వంద్వనీతికి దర్పణం. గాజా పోరులో అమెరికా అధ్యక్షుడి విధానాలపై స్వదేశంలోనే నిరసనలు పెరిగాయి. పాలెస్తీనాకు అనుకూలంగా అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాల్లో వేలాది విద్యార్థులు వీధికెక్కడం విశేషం.

పశ్చిమాసియాలో సమస్య పరిష్కారానికి అమెరికా, దాని భాగస్వాములు పాత కథ వదిలి, మళ్ళీ మథనం చేయాలి. భద్రత పరంగా ఇజ్రాయెల్‌కు ఉన్న ఆందోళనల్ని పోగొడుతూనే, పాలెస్తీనా ప్రజల ప్రత్యేక రాజ్య ఆకాంక్షను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు సఫలమయ్యేలా అటు ఇరాన్‌నూ భాగస్వామిని చేసి, శాశ్వత పరిష్కారానికై పాశ్చాత్య ప్రపంచం కృషి చేయాలి.

ఇరాన్‌ సైతం పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని విస్తరించుకోవడం కోసం లెబనాన్, గాజా, సిరియా, యెమన్‌లలో పరోక్ష శక్తులకు ఆయుధాలు సమకూర్చి, అండగా నిలిచే పని మానుకోవాలి. ఇలా పాముల్ని పాలుపోసి పెంచడం ఉద్రిక్తతల్ని పెంచే పాపమని గుర్తించాలి. ఈ ప్రాంతంలో 90 లక్షల మంది మన ప్రవాసులున్నందు భారత్‌ సైతం ఇజ్రాయెల్, అరబ్‌ దేశాలతో సత్సంబంధాల రీత్యా కీలక భాగస్వాముల్ని ఒక దగ్గరకు చేర్చి, పరిష్కారానికి యత్నించాలి. వాణిజ్యంలో, ఇంధన సరఫరాలో కీలకమైన పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే... ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది.  

Advertisement
Advertisement