సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. సుమారు 25ఎళ్లుగా లైమ్‌లైట్‌లో ఒక హీరోయిన్ కొనసాగడమంటే అంత సులభం కాదు. నేడు కొందరు హీరోయిన్లు అలా వచ్చి, ఇలా వెళ్లిపోతున్నారు. తమలో ఎంతో అందంతో పాటు టాలెంట్ దాగి ఉన్నా కూడా సరైనా అవకాశాలు లేక తమ సినిమా కెరియర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ నాటి నుంచి నేటి తరం హీరోలతో కూడా పోటీ పడుతూ ఏమాత్రం తగ్గకుండా రెండు దశాబ్ధాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తమిళం తెలుగు హిందీ కన్నడం భాషల్లో ఇప్పటికీ తిరుగులేని హీరోయిన్‌గా రాణిస్తున్న త్రిష నేడు (మే4న) 41వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా త్రిష గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
చెన్నై మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించిన త్రిష. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) చదువుకున్నారు. తన చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశారు. అలా 1999 మిస్ చెన్నై పోటీలో విన్నర్‌గా తనేంటో చాటిచెప్పింది. అలా అదే ఏడాదిలో 'జోడి' (తమిళ్) సినిమాతో తెరంగేట్రం చేశారు. అందులో హీరోయిన్ సిమ్రన్‌కు స్నేహితురాలిగా నటించారు.
ఈ సినిమా హిట్ కావడంతో త్రిషకు కూడా సరైన గుర్తింపు వచ్చింది. అలా సౌత్ ఇండియాలోని అందరి దృష్టిని ఆమె ఆకర్షించారు. ఈ క్రేజ్‌తో సూర్యతో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఆమెకు 'మౌనం పెసియదే' తొలిసారిగా వరించింది. అక్కడి నుంచి 'నీ మనసు నాకు తెలుసు' తో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఇందులోని ఒక సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు త్రిష బాగా కనెక్ట్ అయ్యారు.
వర్షంతో మార్పు
2004లో ప్రభాస్‌తో 'వర్షం' సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా త్రిష కెరీర్‌నే మార్చేసింది. శైలజ అలియాస్ శైలు పాత్రలో కనిపించిన త్రిష ప్రేక్షకులను మాయ చేశారు. అలా తన అందంతో అందరినీ వర్షంలో తడిసేలా చేశారు. ఈ క్రమంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా,అతడు,ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ,బుజ్జిగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్‌ల లిస్ట్‌లో త్రిష చేరిపోయారు.
త్రిషకు బాగా నచ్చే హీరోలు
తెలుగులో సీనియర్ హీరోల నుంచి కొత్త హీరోల వరకు అందరితోనూ నటించే అవకాశం ఆమె దక్కింది. స్టార్‌డమ్‌ని పట్టించుకోను అని చెబుతున్న త్రిష కొత్త హీరోలతో కూడా కలిసి నటించారు. నటిగా కెరీర్ ఆరంభించి ఇన్నేళ్లవుతున్నా అవకాశాలు అందుకోవడంలో త్రిష ముందు వరుసలోనే ఉంటున్నారు.
అందుకు ఉదాహరణ రీసెంట్‌గా లియో సినిమాలో మెప్పించిన త్రిష, ప్రస్తుతం చిరంజీవి, అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా బిజీగా ఉంటున్నారు. త్రిషకు బాగా నచ్చే హీరోలు కమల్ హాసన్, వెంకటేశ్, ఆమీర్ ఖాన్. ఇదే విషయం ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరోయిన్స్‌లలో సిమ్రన్, ఏంజలినా జోలి అంటే ఆమెకు చాలా ఇష్టం.
త్రిషపై ఉన్న వివాదాలు
ఇన్నేళ్ల పాటు త్రిష హీరోయిన్‌గా ఉన్నా కూడా ఆమెపై పెద్దగా వివాదాలు చుట్టముట్టలేదు. రూమర్స్ విషయంలో కూడా కాస్త తక్కువేనని చెప్పవచ్చు.2016లో ఒకసారి తమిళుల సంప్రదాయమైన జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె ట్వీట్ చేయడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఫైనల్‌గా కమల్‌హాసన్ ఎంట్రీ ఇచ్చి ఆ గొడవకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఆమెను బాధపెట్టొద్దని ఆయన తమిళ ప్రజలను కోరారు. త్రిష వ్యక్తిగతం గురించి కూడా ప్రచారం జరిగింది.
ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నో చెప్పిందని గతంలో త్రిష గురించి ప్రచారం జరిగింది. కానీ, ఆమె కుంగిపోలేదు. అది నా వ్యక్తిగత విషయమని చెప్పిన త్రిష వాటన్నింటినీ అధిగమించి సినిమాలపైనే తన దారిని మార్చుకుంది. అయితే, తన వివాహం గురించి ఇప్పటికీ కూడా పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటానని త్రిష ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 41 ఏళ్ల ఈ బ్యూటీగా ఆ ఘడియలు ఎప్పుడు వస్తాయో చూడాలి.
కోట్ల రూపాయల ఆస్తులు
హీరోయిన్‌గానే కాకుండా వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా త్రిష ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఒక్కొ సినిమాకు సుమారు. రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం త్రిషకు చెన్నైలో రూ. 15 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉంది. హైదరాబాద్‌లో కూడా త్రిషకు రూ. 8 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో కొన్నిప్లాట్స్ కూడా త్రిషకు ఉన్నాయని సమాచారం. రూ. 5 కోట్ల వరకు విలువ చేసే పలు లగ్జరీ కార్లు ఆమె వద్ద ఉన్నాయట. ఇలా తన 25 ఏళ్ల సినీ కెరియర్‌లో ఇప్పటి వరకు సుమారుగా రూ. 120 కోట్లకు పైగానే ఆస్తులు కూడాబెట్టినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment