గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా కోలీవుడ్‌లో విడుదలైన సినిమా 'జో'. హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఇందులో రియోరాజ్, మాళవిక మనోజ్ జంటగా నటించారు. వారిద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా కోలీవుడ్‌లో ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. కాగా ఇంతకుముందు హరి ముత్తయ్య వంటి దర్శకులతో సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన డ్రమాటిక్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మణికంఠన్ కందస్వామి సమర్పణలో రూపొందుతున్న నూతన చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.
ఇందులో నటుడు రియోరాజ్, నటి మాళవిక మనోజ్ హీరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బ్లాక్ షిప్ కలైయరసన్ తంగవేలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్లాక్ షీప్ ఆర్జె విగ్నేష్, షీలా రాజకుమార్, డైరెక్టర్ ఏ వెంకటేశ్, గజరాజన్, జాన్సన్ దివాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మధేశ్ మాణిక్ ఛాయాగ్రహణం, సిద్ధికుమార్ సంగీతం అందిస్తున్నారు.
చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పెళ్లయిన మగవాళ్ల సమస్యలను స్త్రీలు కూడా అంగీకరించేలా తెరకెక్కిస్తున్న కథాచిత్రమని చెప్పారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుందన్నారు. కాగా దీనికి బ్లాక్ షీప్ సంస్థ సహనిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం కచ్చితంగా జనరంజకంగా ఉంటుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment