మోదీ సభతో బీజేపీలో జోష్‌ | Josh in BJP with Modi Sabha | Sakshi
Sakshi News home page

మోదీ సభతో బీజేపీలో జోష్‌

Published Wed, May 1 2024 5:24 AM | Last Updated on Wed, May 1 2024 5:24 AM

Josh in BJP with Modi Sabha

మళ్లీ 8, 10 తేదీల్లో రాష్ట్రానికి ప్రధాని 

నేడు హైదరాబాద్‌లో అమిత్‌షా రోడ్‌షో 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్న బీజేపీలో ప్రధాని మోదీ బహిరంగసభ నూతనోత్సాహాన్ని నింపింది. ఈ సభ లో యువత పెద్దసంఖ్యలో పాల్గొనడం, మోదీ ప్రసంగం సందర్భంగా కరతాళధ్వనులు,  నినాదాలతో హోరెత్తించడం పార్టీ కేడర్‌లో హుషారు తెచ్చింది. 

ఈ సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి కాంగ్రెస్‌ నాయకులకు నిద్రపట్టదంటూ మోదీ తన ప్రసంగం సందర్భంగా వ్యాఖ్యానించారు. మంగళవారం జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని అల్లాదుర్గ్‌లో నిర్వహించిన సభ సక్సెస్‌ కావడం పట్ల పార్టీ ముఖ్యనేతలు సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు. 

జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా బీబీ పాటిల్‌ను, మెదక్‌ ఎంపీ అభ్యర్థిగా ఎం.రఘునందన్‌రావును గెలిపించాలంటూ మోదీ కోరడంతోపాటు, ఈ ప్రాంతానికి సంబంధించి కేంద్రంలోని తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడంపై ప్రజల్లో మంచి స్పందన కనిపించింది, మళ్లీ మే 8న వేములవాడలో, మే 10న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగసభల్లో మోదీ పాల్గొననున్నారు. 

నేడు అమిత్‌షా రోడ్‌షో... 
బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా బుధవారం హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. 

ఆ తర్వాత పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళి ఆలయం నుంచి అక్కడికి దగ్గరలోని సుధ టాకీస్‌ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. రాత్రి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానాల్లో పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement