ఇదు శ్రీలంక: సీతా ఎలియా | Sakshi
Sakshi News home page

ఇదు శ్రీలంక: సీతా ఎలియా

Published Fri, Oct 20 2023 1:18 PM

Sita Amman Temple Sita Eliya Sri Lanka - Sakshi

శ్రీలంకలో పరిపాలన విభాగాలుగా బ్రిటిష్‌ వాళ్లు అనుసరించిన ప్రావిన్స్‌ విధానమే ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ‘సీతా ఎలియా’ అనే చిన్న గ్రామం శ్రీలంక సెంట్రల్‌ ప్రావిన్స్‌లో ఉంది. శ్రీలంకలో అందమైన హిల్‌ స్టేషన్‌ నువారా ఎలియాకు కిలోమీటరు దూరంలోనే ఉంది సీతా ఎలియా. ఎలియా అనే పదానికి సింహళలో వెలుతురు, కాంతి అనే అర్థాలు చెబుతారు. రామాయణ కాలంలో సీతాదేవి వనవాసం చేసిన అశోక వాటిక ఇదని చెబుతారు. ఇక్కడి ఆలయాన్ని ‘సీతా అమ్మన్‌ టెంపుల్‌’ అంటారు.

అశోకవాటిక
సీతాదేవిని రావణాసురుడు తన రాజ్యం శ్రీలంకకు అపహరించుకుని వెళ్లి అతడి రాజమందిరంలో ఆమెకు బస ఏర్పాటు చేస్తాడు. రావణాసురుడి రాజమందిరంలో నివసించడానికి సీతాదేవి అంగీకరించకపోవడంతో పైగా ఆమె ఎప్పుడూ అశోక చెట్టు కిందనే ఎక్కువ సమయం గడపడాన్ని గమనించిన రావణాసురుడు ఆమె ప్రకృతి ప్రేమికురాలని, ఆమెకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకుంటోందని గ్రహించి ఈ ప్రదేశంలో బస ఏర్పాటు చేసినట్లు చెబుతారు. రావణాసురుడి భార్య మండోదరి కూడా ఈ వనానికి వచ్చి సీతాదేవిని కలిసేదని కూడా చెబుతారు. అశోకవాటిక నిజానికి మనసులోని శోకాన్ని దూరం చేసే అందమైన ప్రదేశమే. ప్రకృతి సౌందర్యానికి నెలువెత్తు నిదర్శనం.

రావణాసురుడు మంచి కళాభిరుచి కలిగిన వాడని, సీతాపహరణం తప్ప మరేరకమైన అవగుణం లేదని చదివే వాళ్లం. అశోకవాటికను చూసినప్పుడు నిజమేననిపించింది. సీత అభిరుచిని గ్రహించడంతోపాటు ఆమె కోసం ఇలాంటి అందమైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం... రావణాసురుడి కళాహృదయానికి అద్దం పడుతోంది. ఇక్కడి సెలయేరు నిరంతరం ప్రవహిస్తుంటుంది. సెలయేటి తీరాన సీతాదేవి స్నానం చేసేదని చెప్పడానికి ఆనవాలుగా సిమెంటు నిర్మాణం ఉంది. సీతాన్వేషణలో భాగంగా శ్రీలంకకు వచ్చిన హనుమంతుడు... సీతాదేవిని కలిసింది ఇక్కడే. ఆ ఘట్టాన్ని ప్రతిబింబిస్తూ సెలయేటి తీరాన శిల్పాలున్నాయి.

భారతీయులు కట్టిన ఆలయం
అశోకవాటికలో ఉన్న సీతా అమ్మన్‌ ఆలయం దక్షిణ భారత నిర్మాణశైలిలో ఉంది. తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస కూలీలుగా వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని నిర్మించారట. ఆలయం లోపలి విగ్రహాల శిల్పనైపుణ్యం అద్భుతంగా ఉంది. కానీ ఆలయగోపురం మీద ఉన్న విగ్రహాలు శిల్పశాస్త్ర గణితానికి లోబడి ఉన్నట్లు అనిపించదు. విగ్రహం ఎత్తును అనుసరించి తల, మెడ, భుజాలు, దేహం, కాళ్ల పొడవులకు శాస్త్రబద్ధమైన కొలతలుంటాయి.

శిల్పాన్ని చెక్కడానికి అవే ప్రధాన ఆధారం.ఆ తర్వాత ఎవరి విగ్రహాన్ని చెక్కుతుంటే సాహిత్యంలో వర్ణించిన ఆ వ్యక్తి దేహాకృతి, రూపలావణ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఆలయ గోపురం మీదున్న విగ్రహాలను చూస్తే శాస్త్రబద్ధమైన పొంతన సరిగ్గా కుదరలేదనిపిస్తుంది. మరి కొంత పరిశీలనగా చూస్తే మాత్రం... శ్రీలంక వాసుల దేహసౌష్ఠవం ప్రభావం ఈ శిల్పాల మీద ఉన్నట్లనిపిస్తుంది. అయితే కూలీలుగా వలస వెళ్లిన వాళ్లు తమకున్న పరిమితమైన వనరుసలతో చేసిన ప్రయత్నాన్ని గౌరవించకుండా ఉండలేం.

యూ ట్యూబర్‌ల షూటింగ్‌
ఇక్కడ పర్యటనకు వచ్చే వాళ్లలో భారతీయులే ఎక్కువ. నేను వెళ్లినప్పుడు ఒక ఉత్తరాది మహిళ తన స్మార్ట్‌ ఫోన్‌లో ఆ ప్రదేశాన్ని షూట్‌ చేస్తూ కామెంటరీ ఇస్తూ కనిపించింది. మరికొంత మంది ఆకాశాన్నంటుతున్న మహావృక్షాలను, సెలయేటి జలప్రవాహ శబ్దాన్ని రికార్డు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రదేశం సౌందర్యాన్ని అచ్చంగా కళ్లకు కట్టాలంటే డ్రోన్‌ కెమెరాతో షూట్‌ చేయాల్సిందే.
– వాకా మంజులారెడ్డి

(చదవండి: ఇదు శ్రీలంక: శ్రీగంగారామ మహా విహారాయ!)

ఈ లింక్‌పై క్లిక్‌చేసి వాట్సాప్‌ ఛానెల్‌ని ఫాలోకండి

Advertisement
Advertisement