గ్రామాల్లో ఓటెత్తారు | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ఓటెత్తారు

Published Thu, May 9 2024 7:20 AM

-

హుబ్లీ: హుబ్లీ, కుందగోళ, నవలగుంద అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు ఎండలను లెక్కచేయకుండా గుంపులు గుంపులుగా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. వయోజనులతో పాటు రోగుల్లో కూడా ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామీణ ప్రాంతాలైన అంచటగేరి, నుల్వి, కుందగోళ, బెనకనహళ్లి, చిక్కనర్తి, రొట్టిగెవాడ తదితర గ్రామాల్లో చిన్న చితకా సమస్యలు మినహా ప్రశాంతంగా ఓటింగ్‌ ముగిసింది. పోలింగ్‌ ప్రారంభానికి ముందు కేంద్రానికి విచ్చేసిన ఓటర్లు వరుసగా బారులు తీరారు. పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి 12 గంటల వరకు చురుగ్గా సాగిన పోలింగ్‌ మధ్యాహ్నం మండుటెండల వేళ కాస్త మందగించింది. సాయంత్రం 4 తర్వాత కొద్ది ఓటింగ్‌ చురుకు అందుకుంది. వృద్ధులు మరొకరి సహాయంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దివ్యాంగులు తాము ఎవరికీ తక్కువ కాదంటూ కేంద్రాలకు వచ్చి ఓటింగ్‌ చేశారు. రొట్టిగెవాడ గ్రామ దివ్యాంగుడు అశోక్‌ కబనూరు మాట్లాడుతూ తన ఓటు తన హక్కు అన్నారు. దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటింగ్‌ చేసే అవకాశం కల్పించినా పోలింగ్‌ కేంద్రానికే అందరిలా వచ్చి ఓటు వేయడం సంతోషం కలిగించిందన్నారు. హుబ్లీ, కుందగోళ, నవలగుంద తాలూకాల్లోని వివిధ గ్రామాల్లో యువత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని సరికొత్త అనుభవాన్ని పొందారు. అణ్ణిగేరి తాలూకాలో 76.92 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తానికి అన్ని చోట్ల ఉత్సాహంగా ఈ సారి పోలింగ్‌లో పాల్గొనడం కనిపించింది. పోలింగ్‌ శాతం పెరగడానికి జిల్లాధికారి, జిల్లా ఎన్నికల అధికారిణి దివ్యప్రభు జిల్లా యంత్రాంగంతో కలిసి చేసిన కృషి ఫలించిందని చెప్పవచ్చు.

Advertisement
Advertisement