Nishtha Satyam: సత్య నిష్ఠతో... | Sakshi
Sakshi News home page

Nishtha Satyam: సత్య నిష్ఠతో...

Published Fri, Feb 9 2024 12:32 AM

UN Womens Nishtha Satyam Is The Voice Of Reason We Need - Sakshi

వివక్ష అనేది ఎక్కడో ఉండదు. మన చుట్టూనే పొంచి ఉంటుంది. అలాంటి వివక్షను సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తోంది నిష్ఠా సత్యం. స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై నిష్ఠగా పనిచేస్తోంది...

బాలీవుడ్‌ సినిమా ‘మొహ్రా’లోని ‘తూ చీజ్‌ బడీ హై మస్త్‌ మస్త్‌’ పాట యువ గళాల్లో ఎక్కువగా వినిపిస్తున్న కాలం అది. అందరిలాగే తాను కూడా ఆ పాట హమ్‌ చేస్తోంది నిష్ఠ. ఆమె తండ్రికి విపరీతమైన కోపం వచ్చి ‘నువ్వు ఎలాంటి పాట పాడుతున్నావో తెలుసా’ అంటు తిట్టాడు. చిన్నపాటి పనిష్మెంట్‌ కూడా ఇచ్చాడు.

‘సరదాగా రెండు లైన్లు పాడినందుకు ఇంత రాద్ధాంతమా?’ అనుకుంది నిష్ఠ. ఒకవేళ ఈ పాట అబ్బాయి పాడి ఉంటే ఇలాగే జరిగి ఉండేదా?
‘జరగదు’ అని బలంగా చెప్పవచ్చు. ఈ సంఘటన ఒక్కటే కాదు పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న కాలంలోనూ లింగవివక్షను ఎదుర్కొంది నిష్ఠ.

మల్టీనేషనల్‌ కంపెనీ కేపీఎమ్‌జీ, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌లలో ఎకానమిస్ట్‌గా పనిచేసిన నిష్ఠా సత్యం ఐక్యరాజ్య సమితిలోకి అడుగు పెట్టింది. ఐక్యరాజ్యసమితిలో పాట్నర్‌షిప్‌ అడ్వైజర్‌గా ప్రయాణం మొదలు పెట్టిన నిష్ఠ డిప్యూటీ హెడ్‌ హోదాలో పనిచేసింది. ఆ తరువాత యూఎన్‌ ఉమెన్‌ మిషన్‌ హెడ్‌– తిమోర్‌–లెస్తే బాధ్యతలు చేపట్టింది.

‘రెండు విధాలుగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించాలి. ఒకటి డిఫాల్ట్‌ సెట్టింగ్‌ రెండోది డిజైన్‌ సెట్టింగ్‌. డిజైన్‌ సెట్టింగ్‌ అనేది పురుషుల నుంచి వచ్చింది. వారికి అనుకూలమైనది’ అంటుంది నిష్ఠ. స్మార్ట్‌ ఫోన్‌ల సైజ్‌ నుంచి పీపీయీ కిట్స్‌ వరకు మార్కెట్‌లో ఉన్న ఎన్నో వస్తువుల డిజైన్‌లు మహిళలకు అనుకూలంగా లేకపోవడంలోని వివక్షను ప్రశ్నిస్తుంది నిష్ఠ.

‘సాంస్కృతిక సందర్భాలు వివిధ మార్గాలలో మహిళలను శక్తిమంతం చేస్తాయి. సాధికారతకు సంబంధించి మన ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దడంలో అర్థం లేదని తిమోర్‌–లెస్తే మహిళల నుంచి నేర్చుకున్నాను’ అంటుంది నిష్ఠా సత్యం.            

Advertisement
Advertisement