చన్నీ, బిట్టు, పప్పీ, టీనూ, కాకా, షెర్రీ, రాజా, రింకూ, మీత్. ముద్దు పేర్లు భలే ఉన్నాయి కదా! ఎన్నికల వేళ పంజాబ్‌లో జనం నోట నానుతున్న పేర్లివి. రాష్ట్రం నుంచి లోక్‌సభ బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు పొడవుగా ఉన్నాయి. పూర్తి పేరు పలకడమే ఇబ్బంది. అందుకే నినాదాలకు, పదేపదే పిలుచుకోవడానికి క్యాచీగా, సులభంగా గుర్తు పెట్టుకోగలిగేలా ముద్దు పేర్లను వాడుతున్నారు!
జలంధర్‌లో చన్నీ..
పంజాబ్ మాజీ సీఎం, జలంధర్ కాంగ్రెస్ అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ అందరికీ ‘చన్నీ’గానే తెలుసు. అందుకే ‘జలంధర్ షహర్.. చన్నీ దీ లెహర్’ (జలంధర్ నగరంలో చన్నీ తరంగం) అంటూ హోరెత్తిస్తున్నారు. ఇక్కడి ఆప్ అభ్యర్థి పవన్ కుమార్ ‘టీనూ’ కోసం ‘సాద టీను.. జలంధర్ దా టీను’ (మన టీనూ.. జలంధర్ టీనూ) అంటూ వైరల్ చేస్తున్నారు. లుధియానా కాంగ్రెస్ అభ్యర్థిగా పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ ‘రాజా’ బరిలో ఉన్నారు. ఆయన కోసం ‘తుహాదా రాజా.. తుహాదే సంగ్’ (మీ రాజా మీతోనే) అనే స్లోగన్ తయారు చేశారు.
స్థానిక ఎమ్మెల్యే అశోక్ పరాషర్ ‘పప్పీ’ ఆప్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఎంపీ రవ్‌నీత్ సింగ్ ‘బిట్టూ’ బరిలో ఉన్నారు. ‘బిట్టు తే రాజా గప్పీ.. జిట్టుగా సడ్డా పప్పీ’ (బిట్టు ఫూలవడం.. పప్పీ గెలవడం ఖాయం ) అని ఆప్, ‘బిట్టూ దే నాల్.. లుధియానా ఖుష్‌హాల్’ (బిట్టు చాలు లుధియానా అంతా ఆనందాలు) అని బీజేపీ హోరెత్తిస్తున్నాయి.
సంగ్రూర్ నుంచి మంత్రి గుర్మీత్ సింగ్ ‘మీత్’ ఆప్ అభ్యరి్థగా నిలబడ్డారు. ‘జిత్తేగా మీత్.. జిత్తేగా సంగ్రూర్’ (మీత్ గెలుస్తారు.. సంగ్రూర్ గెలుస్తుంది) అని ఆయన అనుచరులు వైరల్ చేస్తున్నారు. ఫిరోజ్‌పూర్ నుంచి ఆప్ అభ్యర్థి జగ్దీప్‌సింగ్ బ్రార్ బరిలో ఉన్నారు. ఆయన ఫేస్‌బుక్‌లో ‘కాకా బ్రార్.. ఫర్ ఫిరోజ్‌పూర్’ హ్యాష్‌టాగ్‌తో మద్దతుదారులు నినాదాలిస్తున్నారు. గురుదాస్‌పూర్ నుంచి ఆప్ అభ్యర్థిగా అమన్ షేర్ ‘షెర్రీ’ కల్సీ పోటీ చేస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment