రెప్పవాలదే..!.. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మందికి నిద్రలేమి సమస్య | Sakshi
Sakshi News home page

రెప్పవాలదే..!.. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మందికి నిద్రలేమి సమస్య

Published Wed, Mar 20 2024 5:45 AM

Insomnia is a worldwide problem - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా నిద్రలేమి సమస్య 

40 శాతం మంది నిద్ర సమస్యలతో సతమతం 

డిజిటల్‌ స్క్రీన్‌ల వినియోగంతోనే దీర్ఘకాలిక నిద్రలేమి 

61 శాతం మంది భారతీయుల్లో 6 గంటల కంటే తక్కువ నిద్ర 

‘రెస్‌మెడ్‌’ సర్వేలో వెల్లడి 

సాక్షి, అమరావతి: మానవాళి నిద్రకు దూరమవుతోంది. రాత్రిళ్లు కంటినిండా కునుకు లేకుండానే తెల్లారుతోంది. సగటు 7 గంటల నిద్ర అనేది ఇకపై చెప్పుకోవడానికి తప్ప.. ఆస్వాదించడానికి అవకాశం లేకుండాపోతోంది. ప్రముఖ వైద్య పరికరాల సంస్థ ‘రెస్‌మెడ్‌’ నిర్వహించిన తాజా సర్వేలో దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు తేలింది.

అంతర్జాతీయంగా 40 శాతం మంది ప్రజలు నిద్ర సమస్యతో నలిగిపోతున్నారు. వారంలో కనీసం మూడు రోజుల కూడా మంచి నిద్రను పొందలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో పగటిపూట నిద్రపోవడం, ఉదయాన్నే వివిధ ప్రతికూల ప్రభావాలతో పాటు ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా చిరాకుపడటం కనిపిస్తోంది.  

సామాజిక మాధ్యమాల్లో మునిగితే అంతే..  
రెస్‌మెడ్‌ గ్లోబల్‌ స్లీప్‌ సర్వేలో ఆ్రస్టేలియా, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, భారత్, ఐర్లాండ్, జపాన్, కొరియా, మెక్సికో, న్యూజిలాండ్, సింగపూర్, తైవాన్, థాయ్‌లాండ్, యూకే, యూఎస్‌ఏలో ప్రజల నిద్ర అలవాట్లను ట్రాక్‌ చేసింది. ఇందులో స్వల్పంగా 13 శాతం మంది మాత్రమే రాత్రిళ్లు ఆరోగ్యకర నిద్రను అనుభవిస్తున్నట్టు తేలింది. జపానీయులు (57శాతం) ప్రతి వారం రాత్రిళ్లు సరైన నిద్రలేక ఇబ్బంది పడుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ముఖ్యంగా నిద్రకు ముందు ఎక్కువ మంది సామాజిక మాధ్యమాల్లో ముగినితేలుతుండటం దుష్ప్రభావాలను పెంచుతోంది.

మరికొంతమంది అర్ధరాత్రి వరకు టీవీలు చూడటం, ఇతర డిజిటల్‌ పరికరాలను వినియోగిస్తుండటంతో నిద్ర దూరమైపోతోందని నివేదిక స్పష్టం చేస్తోంది. వ్యక్తిగత ఆందోళనలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఊబకాయం వంటి ప్రధాన కారణాలతో చాలా మంది రాత్రిళ్లు కంటిపై కునుకు వేయట్లేదు. ప్రతి 10 మందిలో ముగ్గురు నిద్ర మధ్యలో మేల్కొనకుండా ఉండలేకపోతున్నారని నివేదిక పేర్కొంది.

యూకేలో 44 శాతం, ఫ్రాన్స్‌లో 42 శాతం మంది ప్రజల్లో నిద్రకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారతదేశంలో 42 శాతం, థాయ్‌లాండ్‌లో 41 శాతం కొంత వరకు రాత్రిళ్లు నిద్ర హాయిగానే ఉన్నట్టు తేలింది. రుతుక్రమం ఆగిన స్త్రీలలో నిద్రలేమి సమస్య అధికంగా ఉంది. ఐర్లాండ్, ఆస్ట్రేలియాలో ఎక్కువ శాతం మహిళలు కలత నిద్రతో ప్రభావితం అవుతున్నారు. నిద్రలో శ్వాసకు అంతరాయాలు(స్లీప్‌ అప్నియా) పెద్ద రుగ్మతగా పరిణమించింది.  

భారత్‌లో అత్యధిక మందికి 6 గంటలు కంటే తక్కువ నిద్ర   
భారత్‌లోనూ అంతర్జాతీయ సర్వేలతో పాటు స్థానిక సర్వేల్లోనూ నిద్రలేమి భయపెడుతోంది. గతంలో రోజుకు ఏడు గంటలు కూడా నిరంతరాయంగా నిద్రపోవడంలో భారతీయలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే తాజా సర్వేలో.. 61 శాతం మంది భారతీయులు గడిచిన 12 నెలల్లో రాత్రిపూట 6 గంటల కంటే తక్కువగా నిద్రపోగా, 38 శాతం మంది 4 నుంచి 6 గంటల మధ్య మాత్రమే నిద్రించడం గమనార్హం. వారిలో దాదాపు 23 శాతం మంది 4 గంటల కూడా నిద్రపోలేదు.

అంటే రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే ప్రజలు 2002లో 50 శాతం నుంచి ఇప్పుడు 55 శాతానికి పెరగడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. దీంతో భారత్‌లో 2024లో నిద్రలేమి సమస్య 61 శాతానికి పెరిగింది. 72 శాతం మంది నిద్రలో ఒకటి, రెండు సార్లు వాష్‌రూమ్‌ని ఉపయోగించడం కోసం మేల్కొంటున్నట్టు తేలింది. చాలా మంది నిద్రపోవడానికి ఆలస్యంగా వెళ్తుండటం కూడా వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.

కోవిడ్‌ బారిన పడిన వారిలో నిద్ర నాణ్యత లోపించినట్టు సర్వేలు చెబుతున్నాయి. నిద్రలేమిని అధిగమించేందుకు రోజూ నడక, గంటపాటు క్రమం తప్పకుండా వ్యాయామం, రాత్రిపూట తేలికపాటి భోజనం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి నిద్రకు మధ్య 3 గంటల సమయాన్ని పాటించడంతో పాటు నిద్రకు మూడు గంటలకు ముందు టీ, కాఫీలకు దూరంగా ఉండాలని, నిద్ర కోసం పుస్తకం చదవడం, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని వారంటున్నారు.    

Advertisement
Advertisement