సూర్య ప్ర‘తాపం’ | Sakshi
Sakshi News home page

సూర్య ప్ర‘తాపం’

Published Fri, Apr 19 2024 1:45 AM

నిర్మానుష్యంగా మారిన భూపాలపల్లి పట్టణంలోని ప్రధాన రహదారి  - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: ఎండలు భగభగమంటున్నాయి.. సూర్యుడు ప్రతాపం చూపిస్తుండడంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు తోడు వడగాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో గురువారం ఉష్ణోగ్రత 45 డిగ్రీల చేరువలోకి చేరింది. ఎండ వేడిమికి తోడు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. పని ప్రదేశాల్లో కార్మికులు, కర్షకులు ఇబ్బంది పడుతుండగా, పిల్లలు, వృద్ధులు ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్య ప్రతాపంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

ఏప్రిల్‌ నెల ఆరంభం నుంచి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు అప్రమత్తత స్థాయికి చేరగా, గురువారం మాత్రం హెచ్చరిక స్థాయి (ఆరెంజ్‌ నుంచి రెడ్‌) చేరువకు చేరింది. జిల్లా అంతటా 41.8 నుంచి 44.9 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా మల్హర్‌లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం..

ఎండలు పెరగడంతో విద్యుత్‌ వినియోగం కూడా పెరుగుతోంది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. భూపాలపల్లి విద్యుత్‌ సర్కిల్‌ ఆపరేషన్‌ పరిధిలో ప్రస్తుతం నిత్యం విద్యుత్‌ కోటా 2.25 మిలియన్‌ యూనిట్లు కాగా.. గత వారం రోజుల నుంచి 2.35 మిలియన్‌ యూనిట్లకు పైగా వినియోగిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో అధికారులు సబ్‌ స్టేషన్ల నిర్వహణపై దృష్టి సారించారు.

ఇబ్బంది పడుతున్న రైతులు, కార్మికులు..

యాసంగి పనులు చివరి దశలో ఉన్న తరుణంలో ఎండ తీవ్రతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల వరి, మిర్చి, మొక్కజొన్న కోతలు, వాటిని ఆరబెట్టడం, కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం వంటి పనుల్లో రైతులు నిమగ్నమై ఉన్నారు. ఎండలో పనులకు వెళ్లటానికి కొందరు కూలీలు వెనుకడుగు వేసున్నారు. పలు ప్రాంతాల్లో పని వేళలను మార్చుకున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లి మధ్యాహ్నానికి తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. కూలీలను రైతులు ట్రాక్టర్లు, ఆటోల్లో చేలకు తీసుకువెళ్లి తిరిగి తీసుకొస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు, సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనులు, కేటీపీపీలో పనిచేసే కార్మికులు, హమాలీలు ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. దుకాణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఉంటుండగా, మధ్యాహ్నం వెలవెలబోతున్నాయి. భూపాలపల్లి పట్టణంలో పలు వీధులు పగటి పూట కర్వ్యూను తలపిస్తున్నాయి.

మండలం ప్రాంతం ఉష్ణోగ్రత

మల్హర్‌ తాడిచర్ల 44.9

గణపురం చెల్పూరు 44.8

చిట్యాల చిట్యాల 44.7

మల్హర్‌ కొయ్యూరు 44.5

రేగొండ రేగొండ 44.4

కాటారం కాటారం 44.1

కొత్తపల్లిగోరి కొత్తపల్లిగోరి 43.8

మహదేవపూర్‌ కాళేశ్వరం 43.5

పలిమెల సర్వాయిపేట 43.3

మహాముత్తారం మహాముత్తారం 43.3

మల్హర్‌ మల్లారం 43.1

మహదేవపూర్‌ పెద్దంపేట 42.9

భూపాలపల్లి భూపాలపల్లి 42.8

మహదేవపూర్‌ మహదేవపూర్‌ 42.8

మొగుళ్లపల్లి మొగుళ్లపల్లి 42.8

కాటారం రేగులగూడెం 42.6

టేకుమట్ల టేకుమట్ల 41.8

జిల్లావ్యాప్తంగా మండుతున్న ఎండలు

గరిష్ట స్థాయికి చేరుతున్న ఉష్ణోగ్రతలు

మల్హర్‌లో అత్యధికంగా

44.9 డిగ్రీలు నమోదు

వడగాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

గురువారం ఉష్ణోగ్రతలు (డిగ్రీలు సెల్సీయస్‌లలో)
1/1

గురువారం ఉష్ణోగ్రతలు (డిగ్రీలు సెల్సీయస్‌లలో)

Advertisement
Advertisement