రూ.8.73 కోట్ల బంగారం, వెండి స్వాధీనం | Sakshi
Sakshi News home page

రూ.8.73 కోట్ల బంగారం, వెండి స్వాధీనం

Published Sat, Apr 20 2024 3:20 AM

బంగారు ఆభరణాల బాక్సులను తెరుస్తున్న అధికారులు   - Sakshi

ధవళేశ్వరం: గ్రామంలోని చెక్‌పోస్టు వద్ద వాహనంలో తరలిస్తున్న రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో గురువారం సాయంత్రం తనిఖీలు చేస్తుండగా బంగారం, వెండి వస్తువులతో వెళుతున్న వ్యాన్‌ను పోలీసులు గుర్తించారు. అందులో రూ.8.15 కోట్ల విలువైన 1.764 కేజీల బంగారు నగలు, రూ.58.72 లక్షల విలువైన 71.473 కేజీల వెండి వస్తువులను గుర్తించారు. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌కు తెలిపారు. రూరల్‌ తహసీల్దార్‌ వైకేవీ అప్పారావు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జి, స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ డి.గోపాలరావు, ధవళేశ్వరం సీఐ జీవీ వినయ్‌ మోహన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, జీఎస్‌టీ అధికారుల సమక్షంలో ఆభరణాల వ్యాన్‌ను తెరిచారు. రాజమహేంద్రవరంలోని ఒక ప్రముఖ నగల దుకాణానికి వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు. రిటర్నింగ్‌ అధికారి ఆదేశాల మేరకు వీటిని ట్రెజరీలో భద్రపరిచారని రాజమహేంద్రవరం సౌత్‌ జోన్‌ డీఎస్పీ అంబికా ప్రసాద్‌ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.

గోదావరిలో దూకి

యువతి ఆత్మహత్య

కొవ్వూరు: రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలో దూకి పడమట భార్గవి(26) దుర్మరణం పాలైంది. రాజమహేంద్రవరం రూరల్‌ పరిధిలో ఉన్న శాటిలైట్‌ సిటీ ప్రాంతానికి చెందిన ఈమె హెచ్‌డీఎఫ్‌సీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు తర్ఫీదు పొందుతోంది. ఎప్పటి మాదిరిగానే బ్యాంకులో ఉద్యోగం నిమిత్తం గురువారం ఇంటి నుంచి బయల్దేరి వెళ్లి తిరిగి రాలేదని తండ్రి వీర వెంకట మల్లేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గోదావరిలో ఎవరో యువతి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అందిన సమాచారంతో వె వెతకగా గురువారం సాయంత్రం మృతదేహం లభ్యమైనట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతదేహాన్ని వెలికి తీసి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ సీహెచ్‌ బాబురావు తెలిపారు.

Advertisement
Advertisement