పన్నెండేళ్ల కల నెరవేరింది | Sakshi
Sakshi News home page

పన్నెండేళ్ల కల నెరవేరింది

Published Sat, Apr 20 2024 1:50 AM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి: ‘‘ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఏపీఆర్‌జేసీలో స్టేట్‌ థర్డ్‌ ర్యాంకు సాధించా. నాగార్జునసాగర్‌లోని రెసిడెన్సియల్‌ కాలేజీలో సీటు వచ్చింది. 2012లో డిగ్రీ చదువుతున్నప్పుడు వ్యాసరచన పోటీలో ‘నా భారతం.. అమర భారతం’ అన్న వ్యాసం రాయగా స్టేట్‌ ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. అందరూ దేశానికి ఉపయోగపడతావంటూ మెచ్చుకున్నారు. ఐపీఎస్‌ కావాలని ఆరోజే నిశ్చయించుకున్నాను. పన్నెండేళ్ల నాటి కల ఇప్పుడు నిజం అయ్యింది’’ అని సివిల్స్‌లో 587 ర్యాంకు సాధించిన ఆర్‌.రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఆరో ప్రయత్నంలో విజయం సాధించానన్నారు. ఐపీఎస్‌కు సెలెక్ట్‌ అయిన రజనీకాంత్‌ను శుక్రవారం కామారెడ్డి కల్కినగర్‌లోని ఆయన ఇంట్లో ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా రజనీకాంత్‌ తన సక్సెస్‌ వెనక శ్రమను, తన కోసం కుటుంబం చేసిన త్యాగాలను వివరించారు. రజనీకాంత్‌ తెలిపిన వివరాలు..

కుటుంబ నేపథ్యం..

మా సొంతూరు రాజంపేట మండలంలోని అర్గొండ. మా నాన్న రామారెడ్డిపేట సిద్దరాములు గంజ్‌లో గుమస్తాగా పనిచేశారు. ప్లంబర్‌గా, మెకానిక్‌గా, డ్రైవర్‌గా.. ఎన్నో వృత్తులు చేశారు. అమ్మ బీడీలు చుట్టేది. నాతోపాటు సోదరుడి కోసం వారు ఎంతో శ్రమించారు. చదువుల కోసం ఆస్తులు కూడా అమ్మారు. బాగా చదివి మంచి కొలువు సాధించు బిడ్డా అంటూ నిరంతరం ప్రోత్సహించారు.

విద్యాభ్యాసం..

ప్రాథమిక విద్య కామారెడ్డి పట్టణంలోని వాసవి స్కూల్‌లో, అనంతరం పదోతరగతి వరకు మెదక్‌లోని కృష్ణవేని స్కూల్‌లో చదివా. ఏపీఆర్‌జేసీ రాసి ఉమ్మడి రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించి నాగార్జునసాగర్‌లోని రెసిడెన్షియల్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశా. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ బీఏ హిస్టరీ, హానర్స్‌ చదివా. ఇగ్నో యూనివర్సిటీ నుంచి ఎంఏ హిస్టరీ పట్టా సాధించా. యూజీసీ నెట్‌ కూడా పాసయ్యా. 2016 నుంచి 2018 వరకు హైదరాబాద్‌లోని ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో టీచింగ్‌ ప్రొఫెషన్‌లో పనిచేశా. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ స్కూళ్లలో టీచింగ్‌ ప్రొఫెషన్‌ కోసం నిర్వహించిన పరీక్షల్లో పాసై, రూ.11 లక్షల ప్యాకేజీతో అవకాశం వచ్చినా.. సివిల్స్‌ మీద ఆసక్తితో దాన్ని వద్దనుకుని ఢిల్లీ బాట పట్టా. పరుగు పందెంలో స్టేట్‌ లెవల్‌లో ప్రతిభ కనబరిచా. 400 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందాలలో స్టేట్‌ లెవల్‌లో పతకాలూ సాధించా. పోలీస్‌ ఆఫీసర్‌ కావాలనుకోవడానికి అథ్లెటిక్స్‌ మీద ఉన్న ఆసక్తి కూడా ఓ కారణమే..

ఆత్మవిశ్వాసంతో ముందుకు..

సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యేందుకు 2018 సంవత్సరంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లాను. అక్కడే ఉండి చదువుకున్నాను. వరుసగా ఐదు ప్రయత్నాలు చేసినా సక్సెస్‌ రాలేదు. అయినా కుంగిపోలేదు. మరింత పట్టుదలతో చదివాను. తొలినాళ్లలో కోచింగ్‌ కోసం జాయిన్‌ అయినా అక్కడ నచ్చకపోవడంతో మానేశాను. సొంతంగా రోజూ ఎనిమిది గంటలు చదివాను. దాదాపు ఆరేళ్ల పాటు చదువు మీదే ధ్యాస పెట్టా. సివిల్స్‌ కొట్టాలన్న లక్ష్యంతోచదివాను. అపజయం ఎదురైనప్పుడు సమీక్షించుకుని, మళ్లీ ఆ పొరపాటు జరగకుండా ముందుకు సాగుతూ వెళ్లాను. చివరి ప్రయత్నంలో 587 వ ర్యాంకు సాధించాను.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత

పోలీసులంటే సామాన్యుడు భయపడే పరిస్థితి పోయి ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడాలి. అంతేగాక సామాన్యుడు కూడా నేరుగా పోలీస్‌ ఉన్నతాధికారిని కలిసే పరిస్థితి ఉండాలి. నేను పోలీస్‌ అధికారినైతే అలాగే వ్యవహరించాలని అనుకునేవాడిని. శిక్షణ పూర్తి చేసుకుని, పోలీస్‌ అధికారిని అయ్యాక నేను కోరుకున్న పద్ధతిలో నడుచుకుంటాను. పేద, ధనిక, సామాన్యుడు, వీఐపీ అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తా.

ఆరేళ్ల శ్రమ ఫలితమిది

ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలన్న

లక్ష్యంతో చదివా..

చివరి ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యా

అమ్మానాన్నల త్యాగాలు మరువలేనివి

‘సాక్షి’ ఇంటర్వ్యూలో సివిల్స్‌ విజేత రజనీకాంత్‌

1/1

Advertisement
Advertisement