ఆరోగ్యానికి మైసూరు రాజుల పెద్దపీట | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి మైసూరు రాజుల పెద్దపీట

Published Mon, Apr 8 2024 12:45 AM

- - Sakshi

మైసూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఎంతో కృషి చేస్తున్నారని, యోగా కు కూడా ప్రాధాన్యమిచ్చారని, మనం కూడా ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని మైసూరు– కొడగు బీజేపీ అభ్యర్థి యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయార్‌ అన్నారు. మైసూరులో ఓ హోటల్లో బీజేపీ వైద్య విద్యా విభాగం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మైసూరు మహారాజులు చేసిన మంచి పనులు అందరికీ తెలుసని, ఆరోగ్య పరిరక్షణ కోసం అప్పట్లోనే పెద్దపీట వేశారని అన్నారు. బెంగళూరులో మింటో ఆస్పత్రి, మైసూరులో కెఆర్‌ ఆస్పత్రి వంటివి నిర్మించారన్నారు. మైసూరు సంస్థానంలో అప్పట్లో బ్రిటన్‌, జర్మనీల కంటే ఉత్తమమైన ఆరోగ్య సేవలు లభించాయని చెప్పారు.

ఈశ్వరప్పా అలక

వీడండి : విజయేంద్ర

శివమొగ్గ: ఇంకా సమయం ఉంది, మించిపోయింది లేదు, మీ కోపాన్ని పక్కనపెట్టి మాతో కలిసి పనిచేయండి, పార్టీ మీకు అండగా ఉంటుంది అని రెబెల్‌ నేత కేఎస్‌ ఈశ్వరప్పకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై. విజయేంద్ర కోరారు. శివమొగ్గ నగరంలో ఆదివారం ఎన్నికల ప్రచారం చేసిన తరువాత నివాసంలో మీడియాతో మాట్లాడారు. దేశమంతటా ప్రధాని మోదీని కీర్తిస్తున్నారని, అలాంటి నేతను ఎదిరించడం ఈశ్వరప్పకు మంచిది కాదన్నారు. ఆయన తాను హైకమాండ్‌ పెద్దలతో మాట్లాడినట్లు చెబుతూ ఇప్పటికై నా మించిపోయంది లేదని, పార్టీలోకి వచ్చి పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో 28 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, ఇలాంటి సమయంలొ మీరు ఇలా మొండికేయడం మంచిది కాదని చెప్పారు.

రమణీయంగా కరగ

చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం పట్టణంలోని శ్రీ ధర్మరాయస్వామి ఆలయంలో పూల కరగ మహోత్సవం శనివారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. కేఎస్‌ ఆర్‌ర్టీసీ డిపో ముందుగల ఆలయంలో సాయంత్రం నుంచి పూజా వేడుకలను నిర్వహించారు. కుప్పం బాలాజి రాత్రి పది గంటలకు ఆలయం నుంచి పూల కరగను ఎత్తుకుని నృత్యం చేస్తూ సాగారు. మంగళ వాయిద్యాల గోష్టి జత కలిసింది. పట్టణంలోని అన్ని వార్డులలో కరగకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పలు కూడళ్లలో కరగధారి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము వరకు కరగ ప్రదర్శన కొనసాగింది.

సీతా రామాంజనేయ

రథోత్సవం

చింతామణి: తాలూకాలోని కంగానహళ్లి గ్రామంలో వెలసిన పురాతన సీతా రామాంజనేయస్వామి ఆలయం బ్రహ్మ రథోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. తహశీల్దార్‌ సుదర్శన్‌ ప్రారంభించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ పండితుల మంత్రోచ్ఛారణల మధ్య తేరును లాగారు. చుట్టుపక్కల గ్రామాలవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. భక్తాదులకు అన్నదానం ఏర్పాటుచేశారు.

1/2

రథోత్సవం వేడుక
2/2

రథోత్సవం వేడుక

Advertisement
Advertisement